అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
– బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చెర్లపల్లి వెంకటరమణ
జడ్చర్ల రూరల్, నవంబర్ 6 (మనఊరు ప్రతినిధి): మొంథా తుఫాన్ ప్రభావంతో ఇటీవల మండలంలో కురిసిన అకాల వర్షాలు పంటలను తీవ్రంగా దెబ్బతీశాయని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చెర్లపల్లి వెంకటరమణ అన్నారు. గురువారం ఆయన మండల పరిధిలోని పలు గ్రామాల్లో పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, రైతులు ఆరునెలలు శ్రమించి సాగు చేసిన ధాన్యం వర్షాలతో తుత్తి ముత్తయిందని, భారీ స్థాయిలో నష్టం నమోదై రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పంటలు దెబ్బతిన్న సందర్భంలో ప్రభుత్వ వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సంచరించి పంట నష్టం అంచనా వేయాల్సిన సమయంలో నిర్లక్ష్యం ప్రదర్శించడం విచారకరమని ఆయన పేర్కొన్నారు. పంటలకు నష్టం వాటిల్లిన రైతులకు కనీసం రూ.40వేలు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధరలను అందించాలని వెంకటరమణ స్పష్టం చేశారు. రైతు కష్టాలను అర్థం చేసుకుని ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది.
