రాత్రి పొద్దుపోయే వరకు నామినేషన్ల స్వీకరణ
నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్
కాకర్జాల సర్పంచ్ స్థానానికి ఒకే ఒక్క నామినేషన్ దాఖలు
సర్పంచ్ గా మాజీ సర్పంచ్ మాడభూషి రాజు ఏకగ్రీవ ఎంపిక
నవాబుపేట, నవంబరు 29 (మనఊరు ప్రతినిధి): మండలంలో శనివారం రాత్రి పొద్దుపోయే వరకు గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగింది. చివరి రోజు చివరి క్షణంలో నామినేషన్ల స్వీకరణ కోసం ఏర్పాటు చేసిన క్లస్టర్ కేంద్రాలకు అభ్యర్థులు భారీగా తరలిరావడంతో నిర్ణీత సమయంలోపల కేంద్రాలలోకి చేరిన అభ్యర్థుల నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి వారి నుండి సంబంధిత అధికారులు రాత్రి వరకు నామినేషన్లు స్వీకరించారు. మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి సందర్శించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. అలాగే స్వీకరణ కేంద్రాలలోకి గుంపులుగా ప్రజలు రాకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఎంపిడిఓ కార్యాలయంలో పోలింగ్ సామాగ్రిని, స్ట్రాంగ్ రూమ్ ను కలెక్టర్ పరిశీలించారు.
కాగా మండల పరిధిలోని కాకర్జాల గ్రామ సర్పంచ్ పదవి కోసం గ్రామ మాజీ సర్పంచ్ మాడభూషి రాజు ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. ఆయనతోపాటు గ్రామానికి చెందిన ఆరు వార్డులకు కూడా ఒక్కొక్కరే నామినేషన్లు దాఖలు చేయడంతో వారి ఎన్నిక కూడా ఏకగ్రీవంగా జరిగింది. గతంలో రాజు 1981 నుండి 1986 వరకు ఉమ్మడి దేపల్లి గ్రామ సర్పంచ్ గా కొనసాగారు. ఆ తర్వాత సుదీర్ఘకాలం పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా, పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శిగా కూడా కొనసాగారు.



