ధూమ్‌దామ్‌గా సాగుతున్న నామినేషన్‌ల సందడి
బాలానగర్ మండల కేంద్రంలో అభ్యర్థుల రద్దీ
బాలానగర్, డిసెంబర్ (మనఊరు ప్రతినిధి): మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రం గురువారం ఎన్నికల హడావుడితో కిక్కిరిసిపోయింది. సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల దాఖలు చివరి దశకు చేరుకోవడంతో అభ్యర్థులు, వారి అనుచరులు భారీగా తరలివచ్చి కార్యాలయం పరిసరాలు సందడిగా మారాయి. ప్రత్యేకంగా తండా పంచాయతీల నుంచి వచ్చిన అభ్యర్థులు భాజా–భజంత్రీలతో ధూమ్‌దామ్‌గా ర్యాలీలు నిర్వహించడంతో మొత్తం ప్రాంతం ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకుంది. రోడ్లపై భారీగా జనసంద్రం కనిపించగా, హోటళ్లు, రెస్టారెంట్లు కూడా నామినేషన్ వేసేందుకు వచ్చిన అభ్యర్థులు, అనుచరులతో నిండిపోయాయి. ఎంపీడీవో కార్యాలయం ప్రాంగణంలోని నామినేషన్ కేంద్రంలో జరిగిన ప్రక్రియలో 68 మంది సర్పంచ్ అభ్యర్థులు, 231 మంది వార్డు సభ్యుల అభ్యర్థులు ఈరోజు నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. నామినేషన్‌ల కోసం వచ్చిన జనాలతో మండల కేంద్రం మొత్తం ఒక చిన్న పండుగ వాతావరణాన్ని తలపించింది..
