కూతురు ఇంటికి వెళ్తూ వృద్ధుడు అదృశ్యం

కూతురు ఇంటికి వెళ్తూ వృద్ధుడు అదృశ్యం

బాలానగర్ నుంచి షాద్‌నగర్‌కు బయలుదేరిన 85 ఏళ్ల పుల్లయ్య ఆచూకీ గల్లంతు

                            బాలానగర్, మార్చి 25 (మనఊరు ప్రతినిధి): మండలంలోని బోడ జానంపేట గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు కూతురు ఇంటికి వెళ్తూ అదృశ్యమైన ఘటన స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సంపంగి పుల్లయ్య (85) సోమవారం సాయంత్రం బాలానగర్ నుంచి షాద్‌నగర్‌లో ఉన్న తన కూతురు ఇంటికి వెళ్లేందుకు ఆటోలో బయలుదేరారు. అయితే, రాత్రి అయ్యే వరకు ఆయన కూతురు ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అనంతరం బంధువులు, చుట్టుపక్కల ప్రాంతాలు, పరిచయస్తుల ఇళ్లలో గాలించినప్పటికీ ఆయన ఆచూకీ లభించలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం పుల్లయ్య కుమారుడు ఆంజనేయులు బాలానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. వృద్ధుడి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతుండగా, ఎవరైనా పుల్లయ్యను గమనించినట్లయితే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.