రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఫ్యాన్ ఊడి మహిళకు గాయాలు

 రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఫ్యాన్ ఊడి మహిళకు గాయాలు

కనీస వసతులు లేక వినియోగదారుల అవస్థలు

మహబూబ్‌నగర్, మార్చి 24 (మన ఊరు ప్రతినిధి): మహబూబ్‌నగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కనీస వసతులు లేక రిజిస్ట్రేషన్ కోసం వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం కార్యాలయానికి వచ్చిన ఓ మహిళపై సీలింగ్ ఫ్యాన్ ఊడి పడటంతో గాయపడిన ఘటన కలకలం రేపింది. రిజిస్ట్రేషన్ నిమిత్తం కార్యాలయానికి వచ్చిన మహిళ బయట వరండాలో ఏర్పాటు చేసిన రేకుల షెడ్డులో బెంచీపై కూర్చొని ఉండగా, ఆఫీస్ సిబ్బంది ఫ్యాన్ స్విచ్ ఆన్ చేశారు. కొద్దిసేపటికే ఫ్యాన్ వేగం అందుకుని ఊడి పడగా, ఫ్యాన్ బ్లేడ్ ఆమె భుజంపై బలంగా తగిలి గాయమైంది. అదృష్టవశాత్తూ ఫ్యాన్ కింద ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రోజూ వందలాది మంది రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయానికి వచ్చి గంటల తరబడి నిరీక్షిస్తున్నా, కూర్చోవడానికి సరిపడా కుర్చీలు, మంచినీటి సౌకర్యం, మహిళలకు ప్రత్యేక మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు రిజిస్ట్రేషన్ చార్జీలు భారీగా వసూలు చేస్తున్నా, మరోవైపు కనీస వసతులు కల్పించకపోవడంపై వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే భద్రతా చర్యలు చేపట్టి, కార్యాలయంలో కనీస సౌకర్యాలు కల్పించాలని ప్రజలు రిజిస్ట్రార్‌ను కోరుతున్నారు.