వేసవి హ్యాండ్‌బాల్ శిక్షణ శిబిరం ఘనంగా ముగింపు
క్రీడలతో ఆరోగ్యం, క్రీడా కోటాతో ఉజ్వల భవిష్యత్ సాధ్యం
వ్యాయామ విద్య పీడీ అండ్ పీఈటీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నిరంజన్
జడ్చర్ల రూరల్, జూన్ 11 (మనఊరు ప్రతినిధి): తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ సహకారంతో మండలంలోని కోడుగల్ గ్రామంలో నిర్వహించిన ఉచిత వేసవి హ్యాండ్‌బాల్ క్రీడా శిక్షణ శిబిరం గురువారంతో విజయవంతంగా ముగిసింది. మే 1 నుంచి జూన్ 11 వరకు కొనసాగిన ఈ శిక్షణా కార్యక్రమంలో కోడుగల్ గ్రామపంచాయతీతో పాటు పరిసర గ్రామాలకు చెందిన సుమారు 40 మంది బాలబాలికలు పాల్గొని హ్యాండ్‌బాల్ క్రీడలో ఉచిత శిక్షణ పొందారు. ఈ శిబిరానికి జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ క్రీడాకారుడు మూడవ విజయ్ నాయక్ శిక్షకుడిగా వ్యవహరించి క్రీడాకారులకు ఆటలోని మెళకువలు, సాంకేతిక నైపుణ్యాలు, శారీరక దారుఢ్యం పెంపొందించే అంశాలపై ప్రత్యేక శిక్షణ అందించారు. శిబిరం ముగింపు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ప్రతినిధులు, క్రీడాకారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ వ్యాయామ విద్య పీడీ అండ్ పీఈటీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దుమర్ల నిరంజన్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఇటువంటి శిక్షణా శిబిరాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. క్రీడలు శారీరక, మానసిక వికాసానికి బాటలు వేయడమే కాకుండా క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. క్రీడాకారులు లభిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణించాలని, తమ కుటుంబాలకు, గ్రామాలకు, జిల్లాకు, రాష్ట్రానికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రెండు శాతం క్రీడా కోటాను విద్య, ఉద్యోగ అవకాశాల సాధనలో వినియోగించుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ఈ సందర్భంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి. శంకర్ నాయక్, ఉపాధ్యక్షులు డాక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ నేటి యువత అధికంగా మొబైల్ ఫోన్లకు పరిమితమై ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో క్రీడలు వారిని ఆరోగ్యవంతమైన జీవనశైలివైపు మళ్లిస్తాయని పేర్కొన్నారు. క్రీడా కార్యకలాపాలు యువతలో శారీరక దారుఢ్యాన్ని పెంపొందించడంతో పాటు చెడు అలవాట్లకు దూరంగా ఉంచుతాయని తెలిపారు. శిబిరంలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను అభినందించిన సంఘ ప్రతినిధులు, భవిష్యత్తులో మరిన్ని ఉచిత క్రీడా శిక్షణా శిబిరాలను నిర్వహించి గ్రామీణ యువతలో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. ఉత్సాహభరిత వాతావరణంలో ముగిసిన ఈ కార్యక్రమం క్రీడాకారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

