నిస్సహాయులకు పోలీసుల చేదోడు
నిస్సహాయుల ఇంటి వద్దకే పోలీసులు వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు సేవలు
జిల్లాలోనే పై విధానాన్ని ప్రప్రథమంగా అమలు చేసిన నవాబుపేట పోలీసులు
నవాబుపేట, ఫిబ్రవరి 27 (మనఊరు ప్రతినిధి): పోలీస్ సేవలను నిస్సహాయుల ఇంటి వద్దకే వెళ్లి అందించే నూతన విధానాన్ని జిల్లాలోనే ప్రప్రథమంగా శుక్రవారం రాత్రి నవాబుపేట పోలీసులు ఎస్సై విక్రమ్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని జంగమయ్యపల్లి గ్రామంలో అమలు చేశారు. ఈ చర్య ద్వారా రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి ఆదేశాల మేరకు, జిల్లా ఎస్పీ డి. జానకి సూచనల మేరకు జిల్లాలలోనే పై విధానాన్ని ప్రప్రథమంగా అమలు చేసిన ఘనతను నవాబుపేట పోలీసులు, ఎస్సై విక్రమ్ సాధించారు. బాధితురాలు జంగమయ్య పల్లి గ్రామానికి చెందిన ఒంటరి మహిళ తోకల కవిత నుండి ఫోన్ ద్వారా సమాచారం అందుకున్న ఎస్సై విక్రమ్ హుటాహుటిన తన సిబ్బందితో కలిసి జంగమయ్యపల్లి గ్రామానికి చేరుకుని, గ్రామానికి చెందిన కవిత నుండి పై విధమైన పిటిషన్ అందుకుని వెంటనే అందుకు సంబంధించి ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. అలాగే కేసు దర్యాప్తును కూడా అదేవిధమైన దూకుడుతో చేపట్టారు. ఈ విధమైన పిటీషన్ల సేకరణకు నవాబుపేట పోలీసులు శ్రీకారం చుట్టడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. పోలీస్ సేవలను మరింత ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో ఈ విధానం మరింత ఉపయోగకరంగా ఉంటుందని మండల ప్రజలు పేర్కొంటున్నారు. బాధితురాలు జంగమయ్య పల్లి గ్రామానికి చెందిన తోకల కవిత ఫిర్యాదు ప్రకారం, ఈనెల 25వ తేది అర్ధరాత్రి ఒంటి గంటకు తన ఇంట్లోని తన గదిలో నిద్రిస్తుండగా, తమ గ్రామానికి చెందిన కెంచె చంద్రం తన ఇంటికి వచ్చి తలుపులకు వేసిన గడియను తొలగించి ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి, తాను నిద్రిస్తున్న గది తలుపులను దబ దబ బాదాడు. అంతేకాక తనను బాధపెట్టడానికి ప్రయత్నించాడు. తలుపు సందులో నుండి చంద్రంను గమనించిన బాధితురాలు అతడి నుండి తనకు హాని ఉందని భావించి పెద్దగా అరిచింది. ఆమె అరుపులకు చుట్టుప్రక్కల వారు మేల్కొని అక్కడికి వచ్చే లోపే నిందితుడు అక్కడినుండి పరారయ్యాడు. అంతకు ముందు నిందితుడు 12 గంటల 26 నిమిషాల సమయంలో తన ఫోన్ కు పలుమార్లు ఫోన్లు కూడా చేశాడని కూడా ఆమె పోలీసులకు వివరించారు. ఈ విధంగా ఆమె తన పిటిషన్ లో పేర్కొనడంతో. ఎస్సై విక్రమ్ ఆమె నుండి పిటిషన్ స్వీకరించి వెంటనే కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. అయితే అదే రోజు నిందితుడు మరో ఇంటికి కూడా వెళ్లి ఈ విధమైన దుశ్చర్యకు పాల్పడినట్లుగా విశ్వసనీయ సమాచారం. ఈ విధానాన్ని ఉపయోగించుకోవాల్సింది నిస్సహాయులు మాత్రమేనని, ఎవరంటే వారు ఈ విధానాన్ని ఉపయోగించుకోకూడదని ఎస్సై విక్రమ్ కోరారు. ఈ విధానం కేవలం నిస్సహాయుల కోసం మాత్రమే పోలీస్ శాఖ అమలు చేస్తుందని ఆయన తెలిపారు.

