దేవనూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. అన్నదమ్ములు దుర్మరణం
చెట్టును ఢీకొట్టిన కారు
ఐదుగురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం
హనుమకొండ, ఏప్రిల్ 2 (మనఊరు ప్రతినిధి): హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం దేవనూరు సమీపంలో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డుపక్కనున్న చెట్టును ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో జనగామ జిల్లా తరిగొప్పుల మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన ఏనుగుల శివ, లోకేష్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతులు ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు కావడంతో నర్సాపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అదే కారులో ప్రయాణిస్తున్న మరో ఐదుగురు గాయపడగా, వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామస్తులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
