అసెంబ్లీ హాలులో వింత సన్నివేశం
సభ ముగిసినా హాల్‌లోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మంతనాలు.. వివేక్‌పై కేటీఆర్ సెటైర్
సభ ముగిసినా హాల్‌ను వీడని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
మైనింగ్ చర్చల తర్వాత గుంపుగా మంతనాలు
వివేక్‌తో అధికారుల మాటామంతీ
“మొత్తానికి సాధించావ్” అంటూ కేటీఆర్ సెటైర్
సీఐడీ విచారణ ఆదేశాలే వ్యాఖ్యకు కారణమా?
హైదరాబాద్, మార్చి 29 (మనఊరు ప్రతినిధి): తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వేళ శనివారం సభా మందిరంలో అరుదైన, ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా సభ వాయిదా పడిన వెంటనే సభ్యులు హాల్‌ను ఖాళీ చేసి వెళ్లిపోవడం ఆనవాయితీ. అయితే ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపించింది. సభ ముగిసిన తర్వాత కూడా బీఆర్ఎస్ సభ్యులు హాల్‌లోనే ఉండి దాదాపు 20 నిమిషాల పాటు ఒకచోట చేరి చర్చలు జరపడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. శనివారం సభలో మైనింగ్ అంశంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం, చర్చ సాగింది. ఇరు పక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ సభా వాతావరణాన్ని వేడెక్కించాయి. అనంతరం ఒకటి రెండు బిల్లులకు సభ ఆమోదం తెలిపినట్లు స్పీకర్ ప్రకటించి, సభను ఆదివారానికి వాయిదా వేశారు. అయితే సభ ముగిసిన తర్వాత స్పీకర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సభ్యులంతా హాల్‌ను వీడినా.. బీఆర్ఎస్ సభ్యులు మాత్రం బయటకు వెళ్లకుండా సభా మందిరంలోనే నిలిచిపోయారు. అనంతరం ఎమ్మెల్యేలంతా ఒకచోట చేరి మైనింగ్ వ్యవహారంపై అంతర్గతంగా చర్చించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో హాలులో ఉన్న అధికారులతో ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతుండగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనను పిలిచి వ్యంగ్యంగా స్పందించినట్లు తెలిసింది. వివేక్ అన్నా.. మొత్తానికి సాధించావ్! అంటూ కేటీఆర్ సెటైర్ వేయడం అక్కడున్న సభ్యుల్లో చర్చకు దారితీసింది. సభలో మైనింగ్ అక్రమాల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ, ఆరోపణలపై సీఐడీ విచారణకు ఆదేశాలు జారీ చేయడం నేపథ్యంలోనే కేటీఆర్ ఈ వ్యాఖ్య చేసినట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో వివేక్ చుట్టూ రాజకీయ వేడి మరింత పెరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ హాలులో సభ ముగిసిన తర్వాత కూడా కొనసాగిన ఈ మంతనాలు, కేటీఆర్ చేసిన సెటైరికల్ కామెంట్‌తో శనివారం జరిగిన పరిణామాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
