వేధింపులకు తాళలేక మహిళా సర్పంచ్ ఆత్మహత్యాయత్నం
కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యుల డిమాండ్
పాల్వంచ, ఫిబ్రవరి 23 (మనఊరు ప్రతినిధి): పంచాయతీ కార్యదర్శి వేధింపులు భరించలేక ఓ మహిళా సర్పంచ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన పాల్వంచ మండలంలో ఆందోళనకు దారితీసింది. మండలంలోని సత్యనారాయణపురం (మొండికట్ట) గ్రామ పంచాయతీ సర్పంచ్ జర్పుల సరితను కొంతకాలంగా కార్యదర్శి మానసికంగా వేధిస్తున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. వార్డు మెంబర్లతో ఫిర్యాదు చేయించి పదవి నుంచి తొలగిస్తామని బెదిరించడం, ఉపాధి హామీ పనుల విషయంలో అనవసర వివాదాలు సృష్టించడం వంటి చర్యలతో ఆమెను ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. ఈ వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన సరిత నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఆమె భర్త పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందుతోంది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.
