యువత క్రీడల్లో రాణించి ప్రతిభ చాటాలి
బీజేపీ రాష్ట్ర నాయకులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి
ఊరుకొండ, మార్చి 17 (మనఊరు ప్రతినిధి): మండల కేంద్రంలో భారతదేశపు అతిపెద్ద క్రీడా వేడుకగా పేరుగాంచిన ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవంలో భాగంగా బీజేపీ రాష్ట్ర నాయకుడు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాలమూరు పార్లమెంటు పరిధిలోని అన్ని మండలాలు, నియోజకవర్గ కేంద్రాలలో పార్లమెంటు స్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. యువత, క్రీడాకారులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని తమలోని ప్రతిభను ప్రదర్శిస్తూ క్రీడా స్ఫూర్తిని చాటాలని పిలుపునిచ్చారు. పాలమూరు పార్లమెంటు పరిధిలో క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ పెద్ద ఎత్తున క్రీడా వేదికలు ఏర్పాటు చేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాల యువతకు మంచి అవకాశాలు కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, జట్టు భావనను పెంపొందిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కే. రాజేందర్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి బ్రహ్మచారి, ఉపాధ్యక్షులు శివ, ప్రవీణ్ రెడ్డి, రవీందర్, సందీప్, మల్లేష్, అఖిల్, లక్ష్మణ్ గౌడ్, బీజేవైఎం మండల అధ్యక్షుడు పూర్ణచందర్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, గిరిజన మోర్చా అధ్యక్షుడు కిరణ్ నాయక్, రామాంజనేయులు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్’ ద్వారా గ్రామీణ యువతలో క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించి, వారిలోని ప్రతిభను వెలికి తీసే దిశగా ఈ పోటీలు దోహదపడతాయని స్థానికులు అభిప్రాయపడ్డారు.



