జీతాల కోసం డీడబ్ల్యూవో కాళ్లపై పడిన దివ్యాంగులు

 కాళ్లు మొక్కినా జీతాలు లేవా..?

సిరిసిల్లలో డీడబ్ల్యూవో ఎదుట దివ్యాంగ కార్మికుల ఆవేదనన్ని రోజులు జీతాలు ఆపేస్తారు.. 

ఉపాధి ఇచ్చి.. జీతాలు ఆపారా? సిరిసిల్లలో దివ్యాంగుల నిరసన

మా కష్టం గుర్తించండి” అంటూ కన్నీటి వినతి

రాజన్న సిరిసిల్ల, మార్చి 14 (మనఊరు ప్రతినిధి): ‘కాళ్లు మొక్కుతాం.. ఎన్ని రోజులు జీతాలు ఇవ్వకుండా ఉంటారు..’ అంటూ కొందరు దివ్యాంగ కార్మికులు జిల్లా సంక్షేమాధికారి (డీడబ్ల్యూవో) లక్ష్మీరాజం కాళ్లపై పడిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని పెట్రోల్‌బంక్‌లో పనిచేస్తున్న దివ్యాంగ ఉద్యోగులు తమకు రావాల్సిన జీతాలు చెల్లించాలని వేడుకుంటూ శుక్రవారం సిరిసిల్ల మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం డీడబ్ల్యూవో లక్ష్మీరాజం సిరిసిల్ల మున్సిపల్‌ ఆఫీస్‌కు వచ్చినట్లు తెలుసుకున్న జిల్లా సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని పెట్రోల్‌బంక్‌లో పనిచేస్తున్న దివ్యాంగ కార్మికులు తిరుపతి, లింగప్రసాద్, మన్మోహన్‌ తదితరులు అక్కడికి చేరుకున్నారు. తమకు నెలల తరబడి జీతాలు అందడం లేదని, పలుమార్లు అధికారులను వేడుకున్నా స్పందన లేకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురై ఆయన కాళ్లపై పడి న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా దివ్యాంగ కార్మికులు మీడియాతో మాట్లాడుతూ, 2024లో అప్పటి జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆధ్వర్యంలో ప్రభుత్వ పెట్రోల్‌బంక్‌లో మొత్తం 24 మంది దివ్యాంగులను నియమించారని తెలిపారు. అయితే ప్రస్తుతం సంక్షేమశాఖ పర్యవేక్షణలో నడుస్తున్న ఆ బంక్‌లో ఆకస్మికంగా కొందరు దివ్యాంగ కార్మికులను తొలగించి, పది మంది మాత్రమే కొనసాగాలని చెప్పడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో, తాము చేసిన పనికి సంబంధించిన జీతాలు లెక్కచేసి ఇవ్వాలని కోరితే అధికారులు స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా, పైగా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. “మేము పని చేశాం.. మా కష్టం వృథా చేయొద్దు.. జీతాలు ఇవ్వండి” అంటూ వారు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఉన్న ప్రజలు, స్థానికులు కూడా దివ్యాంగుల పరిస్థితిని చూసి విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉపాధి కల్పించి, తర్వాత జీతాలు నిలిపివేయడం, ఉద్యోగాలపై అనిశ్చితి నెలకొల్పడం వంటి ఆరోపణలు బయటకు రావడంతో జిల్లా వ్యాప్తంగా ఈ వ్యవహారం చర్చకు దారితీసింది. దివ్యాంగుల పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన సమయంలో, ఇలాంటి పరిస్థితులు నెలకొనడం పట్ల సామాజిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తక్షణమే పెండింగ్‌ జీతాలు చెల్లించి, తొలగింపులపై స్పష్టత ఇవ్వాలని స్థానికులు, దివ్యాంగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.