రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు టీఎన్జీవో ఇఫ్తార్ విందు

 రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు టీఎన్జీవో ఇఫ్తార్ విందు

నాగర్ కర్నూల్, మార్చి 17 (మనఊరు ప్రతినిధి): పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ (టీఎన్జీవో) భవన్‌లో మంగళవారం టీఎన్జీవో జిల్లా శాఖ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు, ముస్లిం ఉద్యోగస్తులకు ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు భావాండ్ల వెంకటేష్, జిల్లా కార్యదర్శి షర్ఫుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగ మిత్రులు, సోదరులు ఎంతో భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు ఆచరిస్తారని, అలాంటి పవిత్ర సమయంలో వారికి ఇఫ్తార్ విందు ఇవ్వడం టీఎన్జీవోలో ఆనవాయితీగా కొనసాగుతోందని తెలిపారు. సమాజంలో సౌహార్దత, సోదరభావం, పరస్పర గౌరవం పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని వారు పేర్కొన్నారు. రంజాన్ మాసం ఆధ్యాత్మికత, నియమ నిష్ఠలకు ప్రతీకగా నిలుస్తుందని, మతసామరస్యాన్ని బలోపేతం చేసే ఇఫ్తార్ విందులు సమాజానికి మంచి సందేశం ఇస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో కోశాధికారి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు కొట్ర బాలాజీ, చెన్నకేశవులు, పి. కళ్యాణ్ కృష్ణారావు, జే.కే. వెంకటేష్, శ్రావణ్, కరిముల్లా, రహీం అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ముస్లిం ఉద్యోగ సోదరులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.