ఎన్నికల ప్రత్యేక సమగ్ర సవరణపై జడ్చర్లలో కీలక సమావేశం
జడ్చర్ల మార్చి 24 (మన8ఊరు ప్రతినిధి): తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల ప్రత్యేక సమగ్ర సవరణ, ఓటర్ల జాబితా నవీకరణ, రాజకీయ పార్టీల సహకారం, బూత్ స్థాయి ఏజెంట్ల (బిఎల్ఎ) నియామకం వంటి కీలక అంశాలపై ఆల్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఈఆర్‌ఓ, అదనపు కలెక్టర్ (రెవెన్యూ), మహబూబ్‌నగర్ జేఎల్‌బీ హరిప్రియ అధ్యక్షత వహించారు. సమావేశంలో జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులతో కలిసి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ముఖ్యంగా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద బూత్ లెవల్ ఏజెంట్ల (బిఎల్ఎ) నియామకం ద్వారా ఓటర్ల జాబితాలో పేర్లు చేరిక, తొలగింపు, మార్పులు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. అదనపు కలెక్టర్ హరిప్రియ మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియలో రాజకీయ పార్టీల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ఖచ్చితత్వం ప్రజాస్వామ్య బలానికి పునాది అని, అందుకే ప్రతి పార్టీ తమ ప్రతినిధుల ద్వారా బూత్ స్థాయిలో చురుకైన సహకారం అందించాలని కోరారు. ఈ సమావేశంలో జడ్చర్ల నియోజకవర్గంలోని అన్ని మండలాల తహసీల్దార్లు, సంబంధిత శాఖల అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఇటువంటి సమన్వయ సమావేశాలు ఎంతో అవసరమని పాల్గొన్న నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమనేత యం. శ్రీకాంత్ కూడా పాల్గొన్నారు.



