భూదాన్ భూమికి అక్రమ కంచె 70ఏళ్ల నుండి ఉన్న దారి బంద్

 భూదాన్ భూమికి అక్రమ కంచె 

70ఏళ్ల నుండి ఉన్న దారి బంద్

తక్షణ చర్యలకు కలెక్టర్ కుష్బూ గుప్తాకు రైతు వినతి

జడ్చర్ల, జూన్ 1 (మనఊరు ప్రతినిధి): జడ్చర్ల మండలంలో భూదాన్ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకుని 70 ఏళ్లుగా వాడుకలో ఉన్న దారిని మూసివేయడంతో రైతుల పంటల సాగు ప్రశ్నార్థకమైంది. మండల పరిధిలోని గోప్లాపూర్ గ్రామ సమీపంలో గల గంగాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 982 భూదాన్ భూమి గుండా తరతరాలుగా ఉన్న మార్గాన్ని ఆ భూమిని కొన్నామని చెబుతూ కొందరు వ్యక్తులు రాత్రికి రాత్రే కంచె వేసి మూసివేశారు. దీంతో ఆ భూమికి అవతలి వైపు భూములు కలిగి ఉన్న సర్వే నంబర్ 182లో రెండు ఎకరాలు కలిగిన జడ్చర్లకు చెందిన యువ రైతు శశాంక్ బాద్మి రైతుల పొలాలకు వెళ్లే మార్గం లేకుండా పోయింది. భూదాన్ భూముల క్రయవిక్రయాలు చట్టవిరుద్ధమని తెలిసినా అక్రమంగా స్వాధీనం చేసుకుని, ఇండియన్ ఈజ్‌మెంట్స్ యాక్ట్-1882 కింద ఉన్న మార్గపు హక్కును భూదాన్ భూమిని కొనుగోలు చేశామని పేర్కొంటున్న అక్రమార్కులు కాలరాస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వారి దుశ్చర్యల కారణంగా సీజన్ సమయంలో ట్రాక్టర్లు, ఎరువులు, కూలీలు పొలాలకు వెళ్లలేక సాగు పనులు పూర్తిగా నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై శశాంక్ బాద్మి సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తాకు వినతిపత్రం అందజేశాడు. రెవెన్యూ, భూదాన్ బోర్డు అధికారులు తక్షణమే క్షేత్రస్థాయిలో పరిశీలించి, అక్రమ కంచెను తొలగించి 70 ఏళ్ల నాటి చారిత్రక దారిని పునరుద్ధరించాలని ఆయన కలెక్టర్ ను కోరాడు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి, చట్టవిరుద్ధంగా మూసివేసిన దారిని తెరిపించి బాధిత రైతుల జీవనోపాధిని కాపాడాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.