తెలంగాణ చరిత్రలో చెరగని ముద్ర వేసిన నవాబుపేట మండలం

 తెలంగాణ చరిత్రలో చెరగని ముద్ర వేసిన నవాబుపేట మండలం 

సకల జనుల సమ్మెతో రాష్ట్ర సాధనకు ఊపిరి పోసిన మండల అఖిలపక్ష పార్టీల నాయకులు

నవాబుపేట, జూన్ 1 (మనఊరు ప్రతినిధి): తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పన్నెండేళ్లు గడిచినా, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నవాబుపేట మండలం చేసిన పోరాట గాథ ఇప్పటికీ ప్రజల గుండెల్లో సజీవంగానే ఉంది. పార్టీలు, కులాలు, వర్గాలకు అతీతంగా ప్రజలంతా ఒక్కటై ఉద్యమ బాట పట్టిన రోజులు, "జై తెలంగాణ" నినాదాలతో మండల కేంద్రం మార్మోగిన క్షణాలు, పదవులను త్యజించి ప్రజల ఆకాంక్ష కోసం నిలబడిన నాయకుల త్యాగాలు నేటికీ మధురస్మృతులుగా నిలిచాయి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేళ ఆ ఉద్యమ ఘట్టాలను మరోసారి గుర్తుచేసుకుంటూ మండల ప్రజలు గర్వంగా నెమరువేసుకుంటున్నారు.తెలంగాణ ఉద్యమం అంటే కేవలం పట్టణాలకే పరిమితం కాలేదు. గ్రామీణ తెలంగాణ కూడా ఉద్యమానికి వెన్నెముకగా నిలిచింది. అలాంటి ప్రాంతాల్లో నవాబుపేట మండలం ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. 1969 తొలి దశ ఉద్యమం నుంచి మలిదశ ఉద్యమం వరకు మండల ప్రజలు ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను సజీవంగా కొనసాగించారు. మలిదశ ఉద్యమం ఊపందుకున్న సమయంలో నవాబుపేటలో అఖిలపక్ష నాయకులు గ్రామగ్రామాన తిరుగుతూ తెలంగాణ అవసరాన్ని ప్రజలకు వివరించారు. విద్యార్థులు, యువత, ఉద్యోగులు, రైతులు, మహిళలు, కార్మికులు, పాత్రికేయులు ఇలా ప్రతి వర్గాన్ని ఉద్యమంలో భాగస్వాములను చేశారు. దీంతో ఉద్యమం రాజకీయ కార్యక్రమంగా కాకుండా ప్రజల ఉద్యమంగా రూపాంతరం చెందింది. ఆనాటి తెలంగాణ ప్రాంతంలోని ఏ ప్రాంతంలో కూడా నిర్వహించని వినూత్న కార్యక్రమాలను మండల అఖిలపక్ష పార్టీల నాయకులు నిర్వహించి ఉద్యమ పటిష్టతకు బాసటగా నిలిచారు. అందులో సకల జనుల సమ్మె, రచ్చబండ ద్వంసం, తెలంగాణ తల్లి నామస్మరణ, మాక్ పోలింగ్ ల నిర్వహణలో రాష్ట్ర స్థాయిలోనే ప్రధానంగా చర్చనీయాంశంగా నిలిచాయి. మండలంలో నిర్వహించిన ఆ కార్యక్రమాల ప్రభావం యావత్ తెలంగాణ ప్రాంతం మొత్తం చూపింది.

సకల జనుల సమ్మెతో మార్మోగిన మండలం

తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలక ఘట్టంగా నిలిచిన సకల జనుల సమ్మె నవాబుపేటలో విశేష ప్రభావం చూపింది. విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూతపడగా, వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. మండల కేంద్రం "జై తెలంగాణ" నినాదాలతో మార్మోగిపోయింది. రచ్చబండ ధ్వంసంలో అరెస్టై జైలు శిక్షణ అనుభవించి విడుదలైన ఉద్యమకారులకు మండల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆనాడు వారికి బాసటగా నిలిచిన యావత్ మండల ప్రజానీకం ర్యాలీగా మహబూబ్ నగర్ జైలు దగ్గర నుండి నవాబుపేట మండల కేంద్రం వరకు వారిపై పూలు చల్లుతూ ఘనంగా సన్మానించారు. వంటావార్పులు, రాస్తారోకోలు, మానవహారాలు, దీక్షలు, టార్చ్‌బేరర్ ర్యాలీలు, బైక్ ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు వంటి వినూత్న కార్యక్రమాలతో ఉద్యమ జ్వాలను మరింత రగిలించారు. ప్రతి గ్రామం ఉద్యమ వేదికగా మారి తెలంగాణ ఆకాంక్షను చాటిచెప్పింది.

పదవుల కంటే తెలంగాణే ముఖ్యమన్న నేతలు

ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పలువురు ప్రజాప్రతినిధులు తమ పదవులను సైతం తృణప్రాయంగా వదిలేశారు. ఉద్యమం కోసం సామూహిక రాజీనామాలు చేసి ప్రజల పక్షాన నిలిచారు. అరెస్టులు, కేసులు, లాఠీచార్జీలను ఎదుర్కొన్నప్పటికీ వెనక్కి తగ్గకుండా ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. వారి త్యాగాలు నేటికీ ప్రజల హృదయాల్లో చెరగని ముద్రగా నిలిచాయి.

అమరవీరుల త్యాగాలకు నివాళిగా

ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలు, ఉద్యమ నాయకుల అంకితభావం, ప్రజల పోరాట పటిమ కలిసే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి దారితీశాయి. రాష్ట్రం ఏర్పడి పన్నెండేళ్లు పూర్తయిన ఈ సందర్భంగా ఉద్యమ స్ఫూర్తిని గుర్తుచేసుకుంటూ మండల ప్రజలు అమరవీరులకు ఘన నివాళులు అర్పిస్తున్నారు.

నేటి తరానికి నవాబుపేట సందేశం

తెలంగాణ ఉద్యమం నవాబుపేటకు కేవలం ఓ చరిత్ర కాదు... అది ఒక గర్వకారణం. ప్రజలంతా ఒక్కటైతే అసాధ్యం అనుకున్న లక్ష్యాలనూ సాధించవచ్చని నిరూపించిన ఉద్యమానికి నవాబుపేట సాక్ష్యంగా నిలిచింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పోరాట స్ఫూర్తిని మరోసారి స్మరించుకుంటూ, అమరుల ఆశయ సాధనకు కృషి చేయాలనే సంకల్పాన్ని మండల ప్రజలు పునరుద్ఘాటిస్తున్నారు.