పాడి పరిశ్రమ అభివృద్ధికి సెక్స్ సార్టెడ్ సీమన్ వినియోగించాలి
పశువులకు సకాలంలో టీకాలు వేయించి వ్యాధులను అరికట్టాలి
మిడ్జిల్ పశు వైద్యశాలను తనిఖీ చేసిన జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ శివానంద స్వామి
మిడ్జిల్, జూన్ 5 (మనఊరు ప్రతినిధి): పశుసంపద అభివృద్ధితో పాటు పాడి రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ శివానంద స్వామి సూచించారు. గురువారం మిడ్జిల్ పశు వైద్యశాలను ఆకస్మికంగా సందర్శించిన ఆయన పశు ఆరోగ్య సేవల అమలు తీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జబ్బ వాపు (ఎల్ఎస్డీ), గొంతు వాపు వ్యాధుల నివారణ టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు. టీకాల లక్ష్యాలు, పురోగతి, అమలు విధానం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పశువులకు సకాలంలో టీకాలు అందించి అంటువ్యాధుల వ్యాప్తిని పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పశువైద్య సిబ్బందికి ఆదేశించారు. అనంతరం పాడి రైతులతో సమావేశమైన డాక్టర్ శివానంద స్వామి ఆధునిక పశుసంవర్ధక విధానాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా సెక్స్ సార్టెడ్ సీమన్ వినియోగం ద్వారా అధిక సంఖ్యలో ఆడ దూడలు జన్మించే అవకాశం ఉంటుందని, దీని వల్ల పాల ఉత్పత్తి పెరిగి రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుందని వివరించారు. పాడి పరిశ్రమను లాభదాయకంగా మార్చేందుకు ఈ సాంకేతికత ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. పశువుల బీమా పథకాల ప్రాధాన్యతను వివరిస్తూ, ప్రమాదాలు లేదా వ్యాధుల కారణంగా కలిగే నష్టాల నుంచి రైతులను రక్షించేందుకు పశు బీమా ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ప్రతి రైతు తన పశువులకు బీమా చేయించుకోవాలని సూచించారు. పశు వైద్యశాలలో అందిస్తున్న వైద్య సేవలు, మందుల నిల్వలు, పశువైద్య సిబ్బంది పనితీరు, గ్రామీణ ప్రాంతాల్లో అమలవుతున్న పశు ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. అలాగే మండలంలోని అయ్యవారిపల్లి, దోనూర్, వేముల గ్రామాల్లో నూతన పశువైద్య ఉపకేంద్రాల ఏర్పాటు, సేవల విస్తరణ, రైతులకు మరింత మెరుగైన వైద్య సదుపాయాల కల్పనపై అధికారులతో చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో పశుసంపద అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న ఆయన, పశువుల ఆరోగ్య పరిరక్షణ విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పశువుల్లో ఏవైనా వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే సమీప పశువైద్యశాలను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి శివానంద్, పశువైద్య సిబ్బంది నర్సింహా, సత్యం, గోపాలమిత్రలు వేణుగోపాల్, రామకృష్ణ, రైతులు సత్యం, జంగయ్య, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
