గ్రామీణ వైద్యుల సేవలు సమాజానికి ఎంతో అవసరం

 గ్రామీణ వైద్యుల సేవలు సమాజానికి ఎంతో అవసరం

ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులకు విజ్ఞాన సదస్సులో నిపుణుల సూచనలు

మహబూబ్‌నగర్, జూన్ 5 (మనఊరు ప్రతినిధి): గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందించడంలో ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులు కీలక పాత్ర పోషిస్తున్నారని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ కె. స్వామి, డాక్టర్ కళ్యాణి పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని స్కౌట్ భవన్‌లో శుక్రవారం గ్రామీణ వైద్య విజ్ఞాన సదస్సు ఘనంగా నిర్వహించారు. డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో జిల్లా నలుమూలల నుంచి ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన డాక్టర్ కె. స్వామి, డాక్టర్ కళ్యాణి మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు చేరువ చేయడంలో గ్రామీణ వైద్యుల పాత్ర ప్రశంసనీయమని అన్నారు. వైద్య రంగంలో రోజురోజుకు కొత్త చికిత్సా విధానాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో గ్రామీణ వైద్యులు కూడా నిరంతరం తమ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. సాధారణ వ్యాధుల గుర్తింపు, ప్రాథమిక చికిత్స, అత్యవసర పరిస్థితుల్లో రోగులను సకాలంలో ఉన్నత వైద్య కేంద్రాలకు తరలించడం వంటి అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో నైతిక విలువలు, సేవా దృక్పథం, బాధ్యతాయుతమైన వైఖరి అత్యంత ముఖ్యమని వారు పేర్కొన్నారు. రోగులకు సరైన సలహాలు, ఆరోగ్య అవగాహన కల్పించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య ప్రమాణాలను మెరుగుపరచవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా వైద్య నిపుణులు అంటువ్యాధులు, జీవనశైలి వ్యాధులు, ప్రథమ చికిత్స, అత్యవసర వైద్య సేవలు, రోగుల సంరక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. వైద్య రంగంలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలను సదస్సులో వివరించారు. కార్యక్రమంలో డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ూ కుమార్ అధ్యక్షత వహించగా, ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, స్కిన్ కేర్ నిపుణులు డాక్టర్ రాజీవ్, పలువురు వైద్యులు, ఆర్‌ఎంపీ, పీఎంపీ సంఘాల ప్రతినిధులు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఇలాంటి విజ్ఞాన సదస్సులు మరింత ఉపయోగపడతాయని పలువురు అభిప్రాయపడ్డారు.