సినిమా పేరిట ప్రేక్షకులపై భారం..? ఓ థియేటర్‌లో తినుబండారాల ధరల దోపిడీపై ఆగ్రహం
సమోసా, వాటర్ బాటిల్‌కు రెట్టింపు ధరలు..
అధికారుల జోక్యం కోరుతున్న ప్రేక్షకులు
కల్వకుర్తి, జూన్ 5 (మనఊరు ప్రతినిధి): కల్వకుర్తి పట్టణంలోని పార్థసారథి థియేటర్‌లో తినుబండారాలు, తాగునీటి సీసాలను అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు ప్రేక్షకుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీశాయి. ఇటీవల విడుదలైన "పెద్ది" సినిమా ప్రదర్శనకు భారీగా ప్రేక్షకులు తరలివస్తుండటంతో, ఈ అవకాశాన్ని కొందరు వ్యాపార ప్రయోజనాలకు వినియోగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రేక్షకుల కథనం మేరకు, సాధారణంగా రూ.15కు లభించే సమోసాను థియేటర్‌లో రూ.30కు విక్రయిస్తుండగా, మార్కెట్‌లో రూ.20 ధర కలిగిన వాటర్ బాటిల్‌ను రూ.30కు అమ్ముతున్నారని తెలిపారు. అంతేకాకుండా విక్రయిస్తున్న తినుబండారాల నాణ్యత కూడా ఆశించిన స్థాయిలో లేదని వారు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సినిమాకు వచ్చే ప్రేక్షకులకు ఈ అదనపు భారం ఇబ్బందిగా మారుతోందని, వినోదం కోసం థియేటర్‌కు వస్తే ఆహార పదార్థాల ధరలు చూసి ఆశ్చర్యానికి గురవుతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. వినియోగదారుల హక్కులను పరిరక్షించాల్సిన సమయంలో ఇలాంటి చర్యలు అన్యాయమని పేర్కొన్నారు. థియేటర్‌లో విక్రయించే ఆహార పదార్థాలు, తాగునీటి సీసాల ధరలపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, ధరల పట్టికలను తనిఖీ చేసి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కల్వకుర్తి ఆర్డీఓ, తహసీల్దార్, లీగల్ మెట్రాలజీ శాఖ, వినియోగదారుల సంరక్షణ శాఖ అధికారులు వెంటనే స్పందించి పార్థసారథి థియేటర్‌లో జరుగుతున్న ధరల వసూళ్లపై సమగ్ర విచారణ చేపట్టి ప్రజలకు న్యాయం చేయాలని ప్రేక్షకులు కోరుతున్నారు. సినిమా చూడటానికి వస్తే టికెట్ కంటే తినుబండారాల ఖర్చే ఎక్కువగా మారుతోంది. అధికారులు స్పందించి ఈ దోపిడీకి అడ్డుకట్ట వేయాలి అని ప్రేక్షకులు విజ్ఞప్తి చేస్తున్నారు.

