సింగరేణి కార్మికుల సమస్యలపై కవిత ‘బాయిబాట’ పర్యటన

సింగరేణి బాటలో కవిత.. జూన్ 15 నుంచి ‘బాయిబాట’ పర్యటన

సింగరేణి కార్మికుల సమస్యలు, ఉద్యోగ భద్రత, సంక్షేమ అంశాలపై ప్రత్యక్షంగా ఆరా 

ఆరు రోజుల పాటు కోల్‌బెల్ట్ ప్రాంతంలోని ప్రధాన గనుల సందర్శన 

కార్మికులతో ముఖాముఖి సమావేశాలు 

కార్మికుల అభిప్రాయాల సేకరణకు ప్రత్యేక కార్యాచరణ

సింగరేణి కార్మికుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటున్న కవిత

హైదరాబాద్, జూన్ 4 (మనఊరు ప్రతినిధి): తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత సింగరేణి కార్మికుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఈ నెల 15వ తేదీ నుంచి కోల్‌బెల్ట్ ప్రాంతాల్లో విస్తృత పర్యటన చేపట్టనున్నారు. ‘బాయిబాట’ పేరుతో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో భాగంగా అండర్‌గ్రౌండ్, ఓపెన్‌కాస్ట్ బొగ్గు గనులను సందర్శించి కార్మికులతో నేరుగా మమేకం కానున్నారు. సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న ఉద్యోగ భద్రత, కార్మిక సంక్షేమం, గనుల నిర్వహణ, భద్రతా ప్రమాణాలు తదితర అంశాలపై వారి అభిప్రాయాలు, సమస్యలను స్వయంగా తెలుసుకోవడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యమని పార్టీ వర్గాలు తెలిపాయి. కోల్‌బెల్ట్ ప్రాంతంలోని వివిధ గనుల వద్ద సమావేశాలు నిర్వహిస్తూ కార్మికులతో ముఖాముఖి చర్చలు జరపనున్నారు.

తొలి విడత పర్యటన షెడ్యూల్

ఆరు రోజుల పాటు కొనసాగే తొలి విడత కార్యక్రమంలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ప్రధాన గనులను సందర్శించనున్నారు.

జూన్ 15: మందమర్రి ప్రాంతం

జూన్ 16: శ్రీరాంపూర్ ఏరియా

జూన్ 17: ఆర్‌జీ-1 ఏరియా

జూన్ 18: ఆర్‌జీ-2 ఏరియా

జూన్ 19: అడ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్టు, ఆర్‌జీ-3 ఏరియా

జూన్ 20: భూపాలపల్లి ఏరియాలోని బొగ్గు గనులు, ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులు

పార్టీ నాయకుల ప్రకారం, సింగరేణి కార్మికుల సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, వారి అభిప్రాయాలను నేరుగా తెలుసుకుని భవిష్యత్ కార్యాచరణకు రూపకల్పన చేయడమే ‘బాయిబాట’ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. కోల్‌బెల్ట్ ప్రాంత రాజకీయ, కార్మిక వర్గాల్లో ఈ పర్యటనపై ఆసక్తి నెలకొంది.