సీఎం బందోబస్తు విధుల్లో విషాదం.. పిడుగుపాటుకు కానిస్టేబుల్ మృతి

సీఎం బందోబస్తు విధుల్లో విషాదం.. 

పిడుగుపాటుకు కానిస్టేబుల్ మృతి

సోమశిలలో సీఎం పర్యటన విధులు ముగించుకుని వస్తుండగా ఘటన

సేవలోనే శాశ్వత నిద్ర.. పిడుగుపాటుకు ఏఆర్ కానిస్టేబుల్ రాజు మృతి

ఉల్పారా గ్రామానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ రాజు మృతి

కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలని ప్రజల విజ్ఞప్తి

నాగర్‌కర్నూల్, జూన్ 5 (మనఊరు ప్రతినిధి): ముఖ్యమంత్రి పర్యటన బందోబస్తు విధులు నిర్వహించి తిరుగు ప్రయాణమవుతున్న ఓ యువ పోలీసు కానిస్టేబుల్‌ను ప్రకృతి ప్రకోపం బలితీసుకుంది. నాగర్‌కర్నూల్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ విషాద ఘటన పోలీసు శాఖతో పాటు జిల్లావ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఉప్పునుంతల మండలం ఉల్పారా గ్రామానికి చెందిన మద్దమల్ల రాజు (2014 బ్యాచ్) ప్రస్తుతం నాగర్‌కర్నూల్ ఆర్మ్‌డ్ రిజర్వ్ (ఏఆర్) విభాగంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గత రెండు రోజులుగా సోమశిలలో జరిగిన ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా బందోబస్తు విధుల్లో పాల్గొన్నారు. శుక్రవారం సాయంత్రం విధులు ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో ఉప్పునుంతల మండలం మామిళ్లపల్లి గ్రామ సమీపంలో వాహనం దిగి పక్కకు వెళ్లిన రాజుపై అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ పిడుగు పడింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న ఉప్పునుంతల పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విధి నిర్వహణలో ఉండగానే రాజు అకాల మరణం చెందడంతో ఉల్పారా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ రాజు కుటుంబ సభ్యులకు జిల్లా పోలీసు యంత్రాంగం తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన భద్రతా విధుల్లో పాల్గొంటూ ప్రాణాలు కోల్పోయిన రాజు కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఆదుకోవాలని స్థానిక ప్రజలు, గ్రామస్తులు మరియు ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన రాజుకు తగిన గౌరవం కల్పించి, ఆయన కుటుంబానికి ఆర్థిక భరోసా అందించాలని కోరారు.