గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు సజీవ దహనం

 గ్యాస్ సిలిండర్ పేలి ఘోర విషాదం

అమ్మమ్మ, మనవడు, మనవరాలు సజీవ దహనం

మిర్యాలగూడలో అర్ధరాత్రి దుర్ఘటన.. 

కుటుంబంలో విషాద ఛాయలు

నల్గొండ, జూన్ 5 (మనఊరు ప్రతినిధి): నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని కలాల్‌వాడలో గురువారం అర్ధరాత్రి జరిగిన ఘోర అగ్నిప్రమాదం మూడు ప్రాణాలను బలితీసుకుంది. ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు గ్యాస్ సిలిండర్ పేలుడుకు దారితీయడంతో అమ్మమ్మ, మనవడు, మనవరాలు సజీవ దహనం కావడం స్థానికంగా విషాదాన్ని నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కలాల్‌వాడకు చెందిన చంద్రకళ, సైదులు దంపతులు. సైదులు అనారోగ్యంతో నెల రోజుల క్రితం మరణించాడు. చంద్రకళ పెద్ద కుమార్తె ధనమ్మ భర్త పదేళ్ల క్రితమే మృతి చెందగా, ఆమె తన ఇద్దరు పిల్లలు లక్ష్మణ్ (16), ప్రణతి (14)తో కలిసి పుట్టింట్లోనే నివసిస్తోంది. జీవనోపాధి కోసం మూడు రోజుల క్రితం ధనమ్మ పుణెకు వెళ్లింది. గురువారం రాత్రి చంద్రకళ తన మనవడు లక్ష్మణ్, మనవరాలు ప్రణతితో కలిసి ఇంట్లో నిద్రిస్తుండగా అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు వ్యాపించాయి. మంటలను గమనించిన స్థానికులు వాటిని ఆర్పేందుకు ప్రయత్నిస్తుండగా ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో ముగ్గురూ మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా వ్యాపించిన మంటలను అదుపులోకి తీసుకొచ్చిన అనంతరం మూడు మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ విషాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబానికి వరుసగా ఎదురైన దురదృష్టకర సంఘటనలు స్థానికులను కలచివేశాయి. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.