కాలువపై బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలి
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని కలిసిన సర్పంచి యాదమ్మ వెంకటయ్యగౌడ్
వెల్దండ, జూన్ 4 (మనఊరు ప్రతినిధి): గ్రామ అభివృద్ధి పనులు వేగవంతం చేయడంతో పాటు కెఎల్ఐ కాలువపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతూ వెల్దండ మండల పరిధిలోని గ్రామ సర్పంచి మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ గురువారం హైదరాబాద్‌లో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామానికి సంబంధించిన పలు అభివృద్ధి అవసరాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా కెఎల్ఐ కాలువపై బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోవడంతో ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. గ్రామాభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలను పరిశీలించి ప్రభుత్వ స్థాయిలో సహకారం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు సర్పంచి తెలిపారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించడం పట్ల గ్రామ ప్రజల తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు రేవల్లి రంగయ్య, మాసుల బాలరాజు, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు భరత్ గౌడ్, బొక్కల శ్రీనివాస్, పుట్ట యాదయ్య, క్యాసరపు తిరుపతి, జంగిలి బాలరాజు, కాళ్ల బాలస్వామి, ఏకుల శ్రీను, నిరటి యాదయ్య, జంగిలి శ్రీను, జంగిలి రవి తదితరులు పాల్గొన్నారు.
