జడ్చర్ల కు కొత్త గా మరో 4 విద్యుత్ 33/11 కెవి సబ్ స్టేషన్లు మంజూరు

 జడ్చర్ల కు కొత్త గా మరో 4 విద్యుత్ 33/11 కెవి సబ్ స్టేషన్లు మంజూరు

 ఇప్పటివరకు మొత్తం 12 సబ్ స్టేషన్లు మంజూరు

  - రూ. 14.60 కోట్లతో కొత్త సబ్ స్టేషన్ల పనులు 

 - గొల్లపల్లి, ఆలూరు, రాణి పేట తో పాటు జడ్చర్ల పట్టణంలో కొత్త సబ్ స్టేషన్లు

- ⁠ కొత్త సబ్ స్టేషన్ల తో మెరుగుపడనున్న విద్యుత్ సరఫరా

- ⁠ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వెల్లడి

జడ్చర్ల, జడ్చర్ల రూరల్, మార్చి 29 (మనఊరు న్యూస్): జడ్చర్ల నియోజక వర్గంలో కొత్తగా నాలుగు విద్యుత్ 33/11 కెవి సబ్ స్టేషన్లు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తెలిపారు. రూ.14.60 కోట్ల రూపాయల వ్యయం తో ఈ కొత్త సబ్ స్టేషన్ల ను నిర్మించనున్నారని వివరించారు. జడ్చర్ల నియోజకవర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 8 కొత్త సబ్ స్టేషన్ల ను మంజూరు చేయడం జరిగిందని శనివారం మీడియా కు విడుదల చేసిన ప్రకటన లో గుర్తు చేశారు.ఇది కాకుండా ఇప్పుడు అదనం గా మరో 4 సబ్ స్టేషన్ల ను ఇప్పుడు మంజూరు చేశారని తెలిపారు. జడ్చర్ల మండలంలోని గొల్లపల్లి, ఆలూరు గ్రామాలతో పాటు జడ్చర్ల పట్టణం లోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంతానికి ఒక సబ్ స్టేషన్ మంజూరు అయిందన్నారు. ఇది కాకుండా మిడిల్ మండలంలోని రాణిపేట కు మరో సబ్ స్టేషన్ మంజూరు కావడం జరిగిందని వివరించారు. ఈ సబ్ స్టేషన్లలో గొల్లపల్లి సబ్ స్టేషన్ నిర్మాణానికి రూ.3.53 కోట్లు, ఆలూరు సబ్ స్టేషన్ నిర్మాణానికి రూ.3.86 కోట్లు, జడ్చర్ల పట్టణం లో నిర్మించే సబ్ స్టేషన్ నిర్మాణానికి రూ.3.54 కోట్లు, రాణి పేట సబ్ స్టేషన్ నిర్మాణానికి రూ.3.67 కోట్లు చొప్పున మొత్తం రూ.14.60 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని అనిరుధ్ రెడ్డి వెల్లడించారు.ఈ కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణం తో విద్యుత్ సరఫరా మరింత మెరుగు పడుతుందని చెప్పారు. గతంలో మంజూరు అయిన 8 సబ్ స్టేషన్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ నాలుగు విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణాలు కూడా సకాలంలో పూర్తి అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అనిరుధ్ రెడ్డి ఆదేశించారు.