రామాలయంలో ఘనంగా శమీ పూజలు

రాంనగర్ రామాలయంలో ఘనంగా శమీ పూజలు

విజయదశమి సందర్భంగా భక్తిశ్రద్ధలతో జమ్మి వృక్షానికి పూజలు

నాగర్‌కర్నూల్, అక్టోబరు 20 (మనఊరు ప్రతినిధి): విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీలో గల శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో మంగళవారం శమీ పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు కందాడై వరదరాజన్ అయ్యంగార్ వేదమంత్రోచ్ఛారణల మధ్య జమ్మి వృక్షానికి శాస్త్రోక్తంగా శమీ పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు జమ్మి వృక్షం చుట్టూ సామూహికంగా ప్రదక్షిణలు చేసి, ఒకరికి ఒకరు ‘బంగారం’గా భావించే జమ్మి ఆకులను భక్తిశ్రద్ధలతో పంచుకున్నారు. విజయదశమి సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించడంతో పండుగ శోభ సంతరించుకుంది. ఉదయం నుంచే సీతారామచంద్రస్వామివారికి ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అర్థం రవీందర్, కాలనీవాసులు, విష్ణు సహస్రనామ పారాయణ కమిటీ సభ్యులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.