వక్ఫ్‌ సవరణ బిల్లు.. ప్రజాస్వామ్యంపై దాడి!

 వక్ఫ్‌ సవరణ బిల్లు.. ప్రజాస్వామ్యంపై దాడి!

 షాద్ నగర్ లో ముస్లింల నిరసన

 పట్టణంలోని ఆయా మసీదుల వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు





కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్‌ (సవరణ) బిల్లును ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై దాడిగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పేర్కొంటుందని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణానికి చెందిన ముస్లిం నాయకులు హఫీజ్ అన్వర్, అలీమ్ షాకిబ్, హాజీ, ఫయాజ్ భాయ్, నయీం, ఇర్ఫాన్, యూసుఫ్, ఆసిఫ్ గోరి, పర్వేజ్, ఆసిఫ్, షాకీర్, షకీల్ తదితరులు పేర్కొన్నారు. శుక్రవారం ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపుమేరకు 

శుక్రవారం నమాజ్ ప్రార్ధనల అనంతరం ఆయా మసీదుల వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు పేర్కొంటూ.. శతాబ్దాల కాలం నుంచి బలంగా ఉన్న మన దేశ బహుళ మత సమాజ సామరస్యాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ నిరంతరంగా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా వక్ఫ్ సవరణ బిల్లు తీసుకొచ్చారని ఆరోపించారు. తప్పుడు ప్రచారం చేయడం, దురభిప్రాయాలను సృష్టించడం ద్వారా మైనారిటీ వర్గాలను బూచిగా చూపేందుకు బీజేపీ యత్నిస్తోందని విమర్శించారు. వక్ఫ్‌ బిల్లు పూర్తిగా లోపభూయిష్టమని పేర్కొన్నారు. వక్ఫ్‌లను నిర్వహించేందుకు గత చట్టాల ద్వారా ఏర్పాటు చేసిన సంస్థల స్థాయి, అధికారాన్ని తగ్గించేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. వక్ఫ్‌ ప్రయోజనాల కోసం భూమిని ఎవరు దానం చేయవచ్చో నిర్ణయించడంపై ఉద్దేశపూర్వకంగా అస్పష్టత ఇచ్చారని, వక్ఫ్‌ నిర్వచనాన్నే మార్చారని వారు ఆరోపించారు. వక్ఫ్‌ పాలనను బలహీనం చేసేందుకు ప్రస్తుతం ఉన్నచట్టంలోని నిబంధనలు తొలగించారని, వక్ఫ్‌ భూములను అక్రమించిన వారికి రక్షణ కల్పించేలా మార్పులు చేశారని ఆరోపించారు. 


 *బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళన* 


వక్ఫ్‌ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశ వ్యాప్త ఆందోళన చేపట్టనున్నట్టు ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు ప్రకటించిందనీ పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన నిరసన ప్రదర్శన విజయవంతం కావడంతో జాతీయస్థాయి ఆందోళన జరపాలని కార్యాచరణ రూపొందించినట్టు తెలిపింది. ఇందుకోసం 31 మందితో యాక్షన్‌ కమిటీని ఏర్పాటు చేసింది. మొదట దశలో భాగంగా ఈ నెల 26న పట్నాలోని అసెంబ్లీ ఎదుట, 29న విజయవాడ (అమరావతి)లోని అసెంబ్లీ ఎదుట ధర్నాలు చేయనున్నట్టు తెలిపింది. ‘వక్ఫ్‌ బిల్లుకు మద్దతు ఉపసంహరించండి...లేకుంటే మా మద్దతును కోల్పోతారు’ అన్న సందేశాన్ని బీజేపీ మిత్ర పక్షాలకు పంపించడమే ఈ ధర్నాల ఉద్దేశమని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల రాజధానుల్లో ప్రదర్శనలను జరుపుతామని ఇందులో పేర్కొన్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌, ముంబయి. కోల్‌కతా, బెంగళూరు, మలేర్‌కోట్లా (పంజాబ్‌), రాంచీల్లో భారీ ఊరేగింపులు ఉంటాయని వివరించారు.