ఊర్కొండ పేట అత్యాచార ఘటనపై ఆరా తీసిన సీఎం

 అత్యాచార బాధితురాలికి ప్రభుత్వం అండ..

ఊర్కొండ పేట అత్యాచార ఘటనపై ఆరా తీసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 

ప్రభుత్వం తరఫున బాధితురాలికి అండగా ఉంటామని హామీ ఇచ్చిన సీఎం. 

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వెల్లడి.

ఊర్కొండ, ఏప్రిల్ 1 (మనఊరు ప్రతినిధి): ఊరుకొండ పేట అత్యాచార ఘటనలో బాధితురాలికి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వెల్లడించారు. ఈ సంఘటన లో నిందితులు ఎవరైనాప్పటికీ వారిని కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

ఊర్కొండ పేట ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో ఒక వివాహిత మహిళపై సామూహిక అత్యాచార సంఘటన జరిగిన నేపథ్యంలో మంగళవారం ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి స్థానిక ఆలయ అధికారులు పోలీస్ అధికారులతో మాట్లాడారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊర్కొండ పేట ప్రాంతం నుంచి మొదటిసారి జెడ్పిటిసి సభ్యుడిగా గెలిచారని ఆ తరువాత ఆయన ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారి ఊర్కొండ పేట ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు జరిపించారని తెలిపారు. తాను కూడా ఎమ్మెల్యే ఎన్నికలలో తన బీఫామ్ ను ఆంజనేయస్వామి పాదాల వద్ద పెట్టి పూజించిన తర్వాతనే నామినేషన్ దాఖలు చేశానని చెప్పారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ ఆలయ సమీపంలో జరిగిన ఈ సంఘటనను సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా పరిగణిస్తున్నారని, ఈ విషయం గా తనతో సీఎం ఫోన్లో మాట్లాడారని అనిరుద్ రెడ్డి వివరించారు. జరిగిన సంఘటనలో 8 మంది నిందితులు ఉన్నారని చెప్తుండగా వారిలో ఆరు మంది బిఆర్ఎస్, ఇద్దరు బిజెపి పార్టీలకు చెందిన వారు ఉన్నారని తన దృష్టికి వచ్చిందన్నారు. 

అయితే ఏ పార్టీ నాయకులైన ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడమని చెప్పరని అందుకే నిందితులు ఏ పార్టీ చెందిన వారైనా కఠినంగా చర్యలు తీసుకోవాలని అన్ని పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారని, ఇప్పుడు రాజకీయాలు ముఖ్యం కాదని బాధితురాలికి న్యాయం చేయడo,అండగా ఉండడమే ప్రధానమని పేర్కొన్నారు. 

కొంతమంది ఈ అత్యాచార సంఘటన ఆంజనేయ స్వామి ఆలయానికి సమీపంలోనే జరిగిందని దుష్ప్రచారం చేస్తున్నారని వాస్తవానికి ఈ సంఘటన జరిగిన ప్రాంతానికి ఆలయం చాలా దూరంగా ఉందని సంఘటన జరిగిన ప్రదేశం కూడా ఆలయానికి చెందిన భూమి కాదని అనిరుద్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే ఊర్కొండ పేట ఆంజనేయస్వామి ఆలయానికి రాష్ట్రవ్యాప్తంగా భక్తులు వస్తుంటారని ఆలయం వెనుక వైపున పెద్ద గుట్టలు అటవీ ప్రాంతం ఉన్న కారణంగా ఆలయ పరిసరాలలో రక్షణ చర్యలు మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఆలయ పరిసరాల్లో లైటింగ్ వసతులను మెరుగుపర్చడంతో పాటు ఆలయ ప్రాంతానికి చుట్టూ కంచె కూడా ఏర్పాటు చేయాల్సి ఉందని అన్నారు. ఈ ఆలయానికి భక్తులు ఎక్కువగా వచ్చే శనివారం రోజున మాత్రమే పోలీస్ పీకేటింగ్ ఉంటుందని అయితే ఇలా కాకుండా ప్రతిరోజు కూడా ఒక పోలీస్ ఆలయం వద్ద రక్షణ గా ఉండే విధంగా తాను పోలీస్ అధికారులతో మాట్లాడుతానని చెప్పారు. జరిగిన సంఘటనపై నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ తో మాట్లాడానని పోలీసులు ఈ సంఘటనకు సంబంధించిన నిందితుల విషయంలో స్వేచ్ఛగా చర్యలు తీసుకోవాలని వారికి మద్దతుగా ఎవరి నుంచి ఎలాంటి వత్తిళ్లు రాకుండా తాను చూసుకుంటానని హామీ ఇచ్చానని తెలిపారు. ఈ సందర్భంగానే విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన బదులిస్తూ సామూహిక అత్యాచార సంఘటనకు సంబంధించిన పలు వివరాలు తనకు తెలిసినప్పటికీ బాధితురాలి సంక్షేమం దృశ్య మానవత దృక్పథంతో ఆ వివరాలను వెల్లడించలేకపోతున్నానని స్పష్టం చేశారు. ఇటువంటి సంఘటనలు గతంలో కూడా జరిగాయని అయితే వాటిపై ఫిర్యాదు చేయడానికి కూడా బాధితులు ముందుకు రాలేదని తనతో కొందరు స్థానికులు చెప్పారని ఈ విషయాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారని అనిరుద్ రెడ్డి వెల్లడించారు. 

ముఖ్యంగా గంజాయి, మాదక ద్రవ్యాలు లాంటి మత్తు పదార్థాల కారణంగా యువత ఫెడద్రోవ పడుతుందని ఊర్కొండ పేట సంఘటనలో నిందితులు కూడా పాతికేళ్ల లోపు వయసు ఉన్నవారేనని చెప్పారు. తమ ప్రభుత్వం గంజాయి, మాదకద్రవ్యాల లాంటి వాటిని ఉక్కుపాదంతో అణచివేయడానికి కృతనిశ్చయంలో ఉందన్నారు. వీటి గురించి తెలిసిన ప్రజలు ప్రభుత్వానికి సమాచారం ఇస్తేనే చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని, తెలిసినా కూడా చెప్పకపోతే వాటిని కట్టడి చేయడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. జరిగిన సంఘటన లో అధికారుల ప్రమేయం ఉందని తేలితే వారు కూడా జైలుకు పోవడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ సంఘటన లో కిలక పాత్ర పోషించినట్లు చెప్పబడుతున్న ఆలయ తాత్కాలిక ఉద్యోగిని ఇప్పటికే ఉద్యోగం నుండి తొలగించడం జరిగిందన్నారు. ప్రస్తుత ఆలయ ఈవో వచ్చిన తర్వాతనే అవినీతి తగ్గిందని ఆలయానికి నూతనంగా నియమించిన పాలకమండలి బాధ్యతలు చేపట్టిన తర్వాతనే ఆలయ పరిసరాలలో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని అనిరుధ్ రెడ్డి వివరించారు. బాధితురాలికి న్యాయం చేస్తానని ఆమె కుటుంబానికి అండగా ఉంటానని ఎమ్మెల్యే పునరుద్ఘాటించారు.