అయ్యో ప్రైవేటు టీచర్లకు టార్గెట్లు
*కాన్వసింగ్ పేరుతో గల్లీల్లో ఇంటింటి ప్రచారాలు*
*ప్రచారాలు ఘణం, సౌకర్యాలు శూన్యం.*
*ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కాన్వసింగ్ పేరుతో ఎండలో తిప్పుతున్న యాజమాన్యం*
*గత సంవత్సరం ఎండలో కాన్వసింగ్ చేయడం వల్ల ఒక టీచర్ మృతి*
మహబూబ్ నగర్ బ్యూరో, ఏప్రిల్ 21 (మనఊరు ప్రతినిధి): షాద్ నగర్ పట్టణంలో గల్లీకొక ప్రైవేటు స్కూల్ చొప్పున సుమారు 100కు పైగా ఉన్నాయి. ధనార్జనే ధ్యేయంగా కొన్ని ప్రైవేటు స్కూల్స్ టీచర్లకు టార్గెట్లు ఇచ్చి మరి ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు ఎండలో పట్టణం అంతటా తిప్పుతున్నారు. ఉదయం 8 నుండే మండే ఎండలు ఉండటంతో టీచర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యతరగతి దిగువ మధ్య తరగతి నుండి వచ్చిన టీచర్లు యాజమాన్యం భయానికి గల్లి గల్లి తిరిగి స్కూల్స్ కోసం ప్రచారం చేస్తున్నారు. రంగురంగుల ప్రచార కరపత్రాలపై మాత్రమే వసతులు ఉంటాయి. స్కూళ్ల ఆవరణలో మాత్రం ఎలాంటి కనీస వసతులు లేని స్కూల్స్ చాలా ఉన్నాయి. పట్టణంలో ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో కొన్నింటిని మినహాయిస్తే చాలా స్కూల్స్ ఇదే తతంగాన్ని నడుపుతున్నాయి. కాన్వసింగ్ పేరుతో క్లాస్ రూమ్లలో విద్యను బోధించే టీచర్లను పట్టణ రోడ్లపై తిప్పుతున్నారు. టీచర్లను ప్రచారానికి తిప్పుతున్న స్కూల్స్ పై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
