ప్రజల ఆరోగ్య రక్షణే మా ప్రభుత్వ ధ్యేయం
షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
*లబ్ధిదారులకు సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
*ప్రభుత్వం అండగా ఉండడం ఎంతో ఆనందం లబ్ధిదారులు*
షాద్‌నగర్, ఏప్రిల్ 27 (మనఊరు ప్రతినిధి): ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతిఒక్కరికి అండగా నిలబడడం తమ ప్రభుత్వ ధ్యేయమని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పేర్కొన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ (సిఎంఆర్ఎఫ్) నుంచి మంజూరైన చెక్కులను శనివారం ఆయన పంపిణీ చేశారు. షాద్‌నగర్ నియోజకవర్గంలోని చౌదర్ గూడెం, కొందుర్గ్, ఫరూఖ్‌నగర్, కొత్తూర్, నందిగామ, కేశంపేట మండలాలతో పాటు షాద్‌నగర్ పట్టణానికి చెందిన 30 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.13,37,500 (పదమూడు లక్షల ముప్పై ఏడువేల ఐదు వందలు) విలువ గల చెక్కులు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్థానిక నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యమే మొదటి ప్రాధాన్యం. ఏ పేద కుటుంబం వైద్య ఖర్చులకు హీనంగా ఉండకూడదు. సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రతినిత్యం కృషి చేస్తోందన్నారు. మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు తమ హర్షాన్ని వ్యక్తం చేస్తూ,"ప్రభుత్వం నుంచి వచ్చిన ఈ సహాయం మాకు నూతన జీవం ఇచ్చినట్టు ఉంది. మేము మించిన అప్పులు పడకుండా, వైద్య చికిత్స తీసుకోవడానికి అవకాశం కల్పించినందుకు సీఎం రేవంత్ రెడ్డి , ఎమ్మెల్యే శంకర్ కి కృతజ్ఞతలు తెలుపుతున్నాం," అని చెప్పారు. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


