వికసించిన అరుదైన *బ్రాకిస్టెల్మా*
జడ్చర్ల రూరల్, ఏప్రిల్ 21 (మనఊరు ప్రతినిధి): పట్టణంలోని డా. బూర్గుల రామకృష్ణ రావు ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలోని తెలంగాణ బొటానికల్ గార్డెన్ లో అత్యంత అరుదైన *బ్రాకిస్టెల్మా బైలోబేటమ్* పుష్పించిందని కళాశాల ప్రిన్సిపాల్ డా. జి. సుకన్య తెలిపారు. ఈ మొక్కను కళాశాల కు చెందిన వృక్షశాస్త్ర సహయాచార్యుడు డాక్టర్. బి. సదాశివయ్య, ఢిల్లీ లోని శ్రీ వెంకటేశ్వర కళాశాల వృక్షశాస్త్ర సహయాచార్యుడు డాక్టర్. ప్రసాద్ లు 2020 లో కనుగొని *బ్రాకిస్టెల్మా బైలోబేటం* అని నామకరణం చేశారు. ఈ మొక్కలు కేవలం నల్లమల ప్రాంతంలో తప్ప ప్రపంచంలో ఎక్కడా లభ్యంకావని, సన్నని కాండం తో కేవలం సియం వరకు పెరుగుతుందని, ప్రతి కనుపు దగ్గర తెల్లని కేశాలు గల 2 ముదురు ఎరుపు లేదా నల్లని పుష్పాలను ఇస్తుందని గార్డెన్ సమన్వయకర్త డా. బి. సదాశివయ్య తెలిపారు. ఈ పుష్పాలు కేవలం 8 మిల్లి మీటర్ లు లేదా 1 సెంటి మీటర్ వరకు మాత్రమే పెరుగుతాయన్నారు. భూమిలోపల దుంపను గలిగిన ఈ మొక్క తొలకరి వర్షాలు పడగానే ముందుగా పొడవాటి కాండాన్ని ఇచ్చి పుష్పిస్తుందని ఆ తరువాత ఆకులను ఇవ్వడం దీని ప్రత్యేకత అని సదాశివయ్య తెలిపారు. *బ్రాకిస్టెల్మా* దుంపలను జలుబు, తలనొప్పి, రొమ్మునొప్పులకు ముందుగా వినియోగిస్తున్నా *బ్రాకిస్టెల్మా బైలోబేటం* దుంపలు ఔషధ గుణాలపై లోతైన పరిశోధనలు జరగాలని డా. సదాశివయ్య ఆకాంక్షించారు. ఇంతటి అరుదైన మొక్క గార్డెన్ లో పుష్పించటం ఇదే మొదటిసారని ఇలాంటి ఎన్నో అరుదైన మొక్కలను కాపడాలనే గార్డెన్ ముఖ్య ఉద్దేశమన్నారు.




