భవిష్యత్తులో ఆర్థిక నిర్వహణను మరింత మెరుగుపరుచాలి
బీజేపీ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్
మహబూబ్ నగర్, ఏప్రిల్ 24 (మనఊరు ప్రతినిధి): భవిష్యత్తులో ఆర్థిక నిర్వహణను మరింత మెరుగుపరుచాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి భాండారి శాంతికుమార్ అన్నారు. న్యూఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో ఈ నెల 23, 24 తేదీల్లో జాతీయ బీజేపీ కోశాధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి భాండారి శాంతికుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర బీజేపీకి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను, పద్దుల నిర్వహణ విధానాన్ని, ఖర్చుల వివరాలను సమావేశంలో సమగ్రంగా వివరించారు. రాష్ట్ర స్థాయిలో నిధుల సేకరణ, వినియోగం, పారదర్శకత వంటి అంశాలను ప్రస్తావించారు. కేంద్ర బీజేపీకి అందవలసిన నివేదికలను సమర్పించి, తెలంగాణ బీజేపీ పద్దులు ఎలా నడుస్తున్నాయన్నదానిపై స్పష్టతనిచ్చారు. ఇది ఒక రకంగా రాష్ట్ర పార్టీకి ప్రాధాన్యత లభించడంతోపాటు, భవిష్యత్తులో ఆర్థిక నిర్వహణను మరింత మెరుగుపరిచే అవకాశాలను కూడా అందించే సందర్భమైంది. సమావేశంలో పాల్గొన్న ఇతర రాష్ట్రాల కోశాధికారులతో అనుభవాలను పంచుకుంటూ, మంచి పద్ధతులపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం ద్వారా బీజేపీ రాష్ట్రాలు తమ ఆర్థిక నిర్వహణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు మార్గదర్శకాలు పొందాయి.





