రాష్ట్రస్థాయి పోటీలో ప్రతిభ కనబరిచిన నిరంజనమ్మను సన్మానించిన కలెక్టర్

రాష్ట్రస్థాయి పోటీలో విజేత నిరంజనమ్మకు కలెక్టర్ సత్కారం

నాగర్ కర్నూల్, మార్చి 17 (మనఊరు ప్రతినిధి): రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచి జిల్లాకు కీర్తి తీసుకువచ్చిన ఆరోగ్య కార్యకర్త ఏ. నిరంజనమ్మను జిల్లా కలెక్టర్ బి. సంతోష్ అభినందించారు. ఈ నెల 15న హనుమకొండ జిల్లాలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన మూడవ రిలే కార్నివాల్ అథ్లెటిక్స్ పోటీల్లో 400 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని ప్రతిభ కనబరిచిన ఆలేరు ఉప కేంద్రంలో పనిచేస్తున్న నిరంజనమ్మను జిల్లా కలెక్టర్ శాలువాతో సత్కరించి, బంగారు పతకం మరియు ప్రశంసా పత్రాలను అందజేసినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ రవికుమార్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 400 మీటర్ల రేసులో చివరి క్షణం వరకు నిరంజనమ్మ చూపిన పట్టుదల ఆమె గెలుపు తపనకు నిదర్శనమని కొనియాడారు. రాష్ట్రస్థాయిలో రాణించి జిల్లాకు పేరు తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత కృషి చేసి జాతీయస్థాయిలోనూ ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు. ప్రజారోగ్య సేవల్లో నర్సుగా అంకితభావంతో పనిచేస్తూనే, మహిళా విభాగంలో క్రీడల్లోనూ రాణించడం ఇతరులకు ఆదర్శమని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ రవి నాయక్, డీఐఓ సురేష్ బాబు, డాక్టర్ నాగేశ్వరి, తెలకపల్లి సర్పంచ్ కొమ్ము శేఖర్ తదితరులు పాల్గొన్నారు.