ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

 ప్లాస్టిక్ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

పొల్యూషన్ కంట్రోల్ అధికారి సాజీనా

నాగర్ కర్నూల్, మార్చి 17 (మనఊరు ప్రతినిధి): ప్లాస్టిక్ కాలుష్యం నేటి సమాజానికి పెను సమస్యగా మారిందని, దాని నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారి సాజీనా పిలుపునిచ్చారు. నాగర్ కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మన తెలంగాణ – పరిశుభ్ర తెలంగాణ నినాదంతో తెలంగాణ నేషనల్ గ్రీన్ క్రాప్స్, కళాశాల ఎకో క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లో ప్లాస్టిక్ వాడకం పర్యావరణానికి, జీవజాలానికి, మానవ ఆరోగ్యానికి కలిగించే నష్టాలను వివరించారు. ముఖ్య అతిథిగా హాజరైన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారి సాజీనా మాట్లాడుతూ, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం కాలానుగుణ అవసరమని పేర్కొన్నారు. ప్లాస్టిక్ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, తమతో పాటు ఇతరులను కూడా చైతన్యపరచాలని సూచించారు. అనంతరం విద్యార్థులు ప్లాస్టిక్ కారణంగా కలిగే నష్టాలను వివరిస్తూ చైతన్య సందేశాలు అందించారు. కళాశాల ప్రిన్సిపల్ మదన్ మోహన్ మాట్లాడుతూ, ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యార్థుల్లో పర్యావరణ బాధ్యత పెంపొందించేందుకు ఇటువంటి అవగాహన కార్యక్రమాలు ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో ఐక్యూఏసీ కోఆర్డినేటర్ వనిత, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు ఉమాదేవి, కోదండరాములు, రామకృష్ణ, ముజఫర్, దశరథం, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.