ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఉచిత వైద్య శిబిరం

చెరుకూరు గ్రామంలో కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు 

ప్రజలకు సేవలందించిన నాయకులు

వెల్దండ, ఏప్రిల్ 14 (మనఊరు ప్రతినిధి): జిల్లా వెల్దండ మండలం చెరుకూరు గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బచ్చలకూర శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, మండల నాయకురాలు మాజీ జెడ్పిటిసి విజిత రెడ్డి, మండల అధ్యక్షుడు పుట్టా రామిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు గ్రామ సర్పంచ్ మరియు ఇతర నాయకులతో కలిసి డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గ్రామస్తులు, యువకులు, నాయకుల సమక్షంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. తర్వాత సర్పంచ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి ప్రజలకు వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా గోలి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి రోజున గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం ఆనందకరమని అన్నారు. భారత రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ వంటి మహనీయుని జయంతిని ఇలాంటి సేవా కార్యక్రమాలతో నిర్వహించడం సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలను నియోజకవర్గం మొత్తం విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, ప్రజలు, యువకులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.