మళ్లీ మెరిసిన కూచూర్ ఆణిముత్యం

మళ్లీ మెరిసిన కూచూర్ ఆణిముత్యం

991 మార్కులతో మరోసారి స్టేట్ ర్యాంక్ సాధించిన వర్షిత

నవాబుపేట, ఏప్రిల్ 12 (మనఊరు ప్రతినిధి): మండల పరిధిలోని కూచూర్ గ్రామానికి చెందిన ఇప్ప వర్షిత మరోసారి తన ప్రతిభతో రాష్ట్ర స్థాయిలో సత్తా చాటింది. గత ఏడాది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించి స్టేట్ ర్యాంకర్‌గా నిలిచిన ఆమె, ఈ సంవత్సరం సెకండియర్ పరీక్షల్లో మరింత మెరుగైన ప్రదర్శన కనబరిచి 1000 మార్కులకు గాను 991 మార్కులు సాధించి మరోసారి స్టేట్ ర్యాంక్ సాధించింది. 99.36 శాతం మార్కులతో ఆమె సాధించిన ఈ విజయంతో కూచూర్ గ్రామం గర్వంతో తలెత్తుకుంది. సాధారణ కుటుంబానికి చెందిన వర్షిత తల్లిదండ్రులు ఇప్ప సువర్ణ, చెన్నయ్యలు కష్టపడి జీవనం సాగిస్తూ తమ కుమార్తె చదువుకు అండగా నిలిచారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ విద్యపై ఎప్పుడూ రాజీ పడకుండా, క్రమశిక్షణతో చదువును కొనసాగించిన వర్షిత చిన్ననాటి నుంచే చదువులో ప్రతిభ కనబరుస్తూ ఉపాధ్యాయుల ప్రశంసలు అందుకుంది. పాఠశాల దశ నుంచే మెరుగైన ఫలితాలు సాధిస్తూ లక్ష్యసాధన కోసం కఠోరంగా శ్రమించిన ఆమె, క్రమబద్ధమైన టైమ్‌టేబుల్ పాటిస్తూ స్వీయ అధ్యయనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. తనకు కలిగిన సందేహాలను ఎప్పటికప్పుడు మల్దకల్ మండలంలోని బిజ్జారం గ్రామంలో గల మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల కళాశాల అధ్యాపకులను సంప్రదిస్తూ చదువును మరింత పటిష్టంగా తీర్చిదిద్దుకుంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల మార్గదర్శకత్వం, తన కృషి, ఈ మూడు కలిసి ఆమెను రాష్ట్ర స్థాయి విజయానికి చేర్చాయి. వర్షిత సాధించిన ఈ ఘనతపై గ్రామస్తులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా మరెన్నో విజయాలు సాధిస్తూ ఉన్నత చదువులు పూర్తి చేసి మంచి ఉద్యోగం సాధించి గ్రామానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కూచూర్ గ్రామ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.