జడ్చర్లలో అగ్నిమాపక వారోత్సవాలకు శ్రీకారం
జడ్చర్ల, ఏప్రిల్ 14 (మనఊరు ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన, అత్యవసర, పౌర రక్షణ సేవల శాఖ ఆధ్వర్యంలో జడ్చర్ల పట్టణంలో అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక అగ్నిమాపక కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. ఈ సందర్భంగా స్టేషన్ ఫైర్ ఆఫీసర్ (ఎస్ఎఫ్ఒ) పి. రాజేందర్ అగ్నిమాపక పతాకాన్ని ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అగ్నిమాపక సిబ్బందిని స్మరించుకుంటూ అధికారులు, సిబ్బంది రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం జడ్చర్ల సీఐ కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై, ప్రజల్లో అగ్ని ప్రమాదాలపై అవగాహన పెంపొందించేందుకు రూపొందించిన కరపత్రాలను విడుదల చేశారు. వారోత్సవాల సందర్భంగా అగ్ని ప్రమాదాల నివారణ, జాగ్రత్తలు, అత్యవసర సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించే పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అగ్ని ప్రమాదాలను నివారించడంలో భాగస్వాములు కావాలని కోరారు.

