నిరుపేద బాలికలకు కార్పొరేట్ స్థాయి ఉచిత విద్య…
ఉప్పల ట్రస్ట్ వినూత్న నిర్ణయం
తలకొండపల్లి, ఏప్రిల్ 14 (మనఊరు ప్రతినిధి): తల్లిదండ్రులు లేని నిరుపేద ఆడపిల్లలకు కార్పొరేట్ స్థాయి ఉచిత విద్యను అందించేందుకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ముందుకొచ్చిందని ట్రస్ట్ చైర్మన్, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కేంద్రంలోని చౌరస్తాలో నిర్మితమవుతున్న ఉప్పల ఆశ్రమ పాఠశాల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్యే మనిషి భవిష్యత్తును మార్చగల శక్తి అని, విద్య ద్వారానే కుటుంబ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని పేర్కొన్నారు. కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల్లో అధిక ఫీజులు చెల్లించలేక చదువును మధ్యలోనే మానేయాల్సి వస్తున్న పేద విద్యార్థినులకు ఈ ఆశ్రమ పాఠశాల ఒక సువర్ణావకాశమని అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని అనాథ మరియు ఆర్థికంగా వెనుకబడిన బాలికలకు 6వ తరగతి నుండి ఇంటర్ వరకు ఉచితంగా వసతి, భోజన సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించనున్నట్లు వెల్లడించారు. ఇంటర్ స్థాయిలో ఎంపీసీ, బైపీసీ గ్రూపులు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు ఆపేసిన బాలికలకు తమ ఆశయాలు సాధించే వేదికగా ఈ పాఠశాల నిలుస్తుందని చెప్పారు. తల్లిదండ్రులు లేని విద్యార్థినులకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు తల్లి మాత్రమే ఉన్న వారు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు వివరించారు. మొత్తం 400 మంది విద్యార్థినులకు సీట్లు కల్పించనున్నామని, అవసరమైతే మరిన్ని సీట్లు పెంచే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు 600 మంది విద్యార్థులు వివిధ కార్పొరేట్ స్థాయి పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్నారని తెలిపారు. అందరినీ ఒకే ప్రాంగణంలో నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో రూ.10 కోట్ల వ్యయంతో ఉప్పల ఆశ్రమ పాఠశాలను నిర్మిస్తున్నట్లు చెప్పారు. ట్రస్ట్ ద్వారా చదివిన సుమారు 2500 మంది విద్యార్థులు విదేశాల్లో స్థిరపడి, ఈ పాఠశాలకు సహకరించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఆహ్లాదకర వాతావరణం, విశాలమైన తరగతి గదులు, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో విద్య అందించనున్నట్లు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభమవుతాయని, మే 1వ తేదీ నుంచి అడ్మిషన్లు స్వీకరించనున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అర్హులైన బాలికలను గుర్తించి, కులమత భేదాలు లేకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకునేలా నాయకులు ప్రోత్సహించాలని ఉప్పల వెంకటేష్ కోరారు.
