రైతులకు ఊరట…
వెల్దండ, కల్వకుర్తిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ప్రారంభం
కల్వకుర్తి (మన ఊరు ప్రతినిధి): కల్వకుర్తి నియోజకవర్గంలో రైతులకు మేలు చేసే దిశగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి సుడిగాలి పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా వెల్దండలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతులు ఇబ్బందులు పడకుండా సీజన్ ప్రారంభంలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాలు ఆలస్యమైతే రైతులు దళారుల చేతుల్లో మోసపోయే అవకాశముందని, అందుకే ముందస్తుగా కేంద్రాలు ప్రారంభించామని పేర్కొన్నారు. కల్వకుర్తిలో కూడా ఇదే విధంగా కొనుగోలు కేంద్రం ప్రారంభించనున్నట్లు చెప్పారు. తన పర్యటనలో భాగంగా రాంనూతల గ్రామంలో నిర్వహించిన ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే రంగారెడ్డి జిల్లా పరిధిలోని అమంగల్, తలకొండపల్లి, మాడ్గుల, కడ్తాల్ మండలాలకు చెందిన 18 మంది దివ్యాంగులకు మొదటి విడతగా రూ.1.25 లక్షల విలువ గల 18 స్కూటీలను పంపిణీ చేసినట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధి కోసం 200 మొబైల్ ఫోన్లు కూడా అందజేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వంగా కొనసాగుతున్న ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు పెద్దపీట వేస్తోందని, అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఫలాలు చేరేలా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు.



