అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసిన టీజీ సీపీఎస్ఈయూ నాయకులు

సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరణకు డిమాండ్

అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసిన టీజీ సీపీఎస్ఈయూ నాయకులు

నాగర్ కర్నూల్, ఏప్రిల్ 14 (మనఊరు ప్రతినిధి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా టీజీ సీపీఎస్ ఈయూ రాష్ట్ర కోశాధికారి సనాతన బాలస్వామి ఆధ్వర్యంలో సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సనాతన బాలస్వామి మాట్లాడుతూ 2004 సెప్టెంబర్ 1 తర్వాత నియామకమైన ఉద్యోగులపై కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను బలవంతంగా అమలు చేశారని విమర్శించారు. రిటైర్డ్ ఉద్యోగులు, మరణించిన ఉద్యోగుల కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం ఉద్యోగులందరూ సమానమని, అందరికీ సమాన పెన్షన్ ఉండాలని పేర్కొన్నారు. కానీ కొంతమందికి పాత పెన్షన్, మరికొంతమందికి కొత్త పెన్షన్ విధానం అమలు చేయడం అన్యాయమని అన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పెన్షన్ వ్యాలిడేషన్ యాక్ట్–2025 వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది పెన్షనర్ల జీవితాలు ప్రభావితమవుతాయని తెలిపారు. వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు సందీప్ కుమార్, సుబయ్యతో పాటు జిల్లా నాయకులు సుదర్శన్, పాండు, రామాంజనేయులు, విష్ణు, శివ, కర్ణయ్య తదితర సీపీఎస్ ఉద్యోగులు, పాల్గొన్నారు.