యువత శక్తితోనే దేశ భవిష్యత్తు బలోపేతం

యువత శక్తితోనే దేశ భవిష్యత్తు బలోపేతం

విద్యతో పాటు వ్యాయామం కూడా అవసరం : అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు

విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫాంల పంపిణీ చేసిన డాక్టర్ హేమంత్ కుమార్

నాగర్ కర్నూల్, మే 22 (మనఊరు ప్రతినిధి): శారీరక దృఢత్వం ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమని, చిన్నతనం నుంచే విద్యార్థులు వ్యాయామం అలవాటు చేసుకోవాలని నాగర్ కర్నూల్ అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. యువత దేశ భవిష్యత్తుకు బలమైన ఆధారమని, వారు క్రమశిక్షణతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జడ్పీ మైదానంలో లక్ష అథ్లెటిక్స్ కోచింగ్ అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు ప్రముఖ న్యూరో ఫిజీషియన్ డాక్టర్ హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ యూనిఫాంలను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తరగతి గదుల్లో విలువలతో కూడిన విద్య ఎంత ముఖ్యమో, మైదానంలో శారీరక వ్యాయామం కూడా అంతే అవసరమని తెలిపారు. విద్యార్థులకు కఠిన శిక్షణ ఇస్తూ వారిని ప్రోత్సహిస్తున్న కోచ్ మల్లేష్ సేవలు అభినందనీయమన్నారు. అలాగే సుమారు రూ.50 వేల విలువైన స్పోర్ట్స్ యూనిఫాంలను 30 మంది విద్యార్థులకు అందించడం డాక్టర్ హేమంత్ కుమార్ దాతృత్వానికి నిదర్శనమని కొనియాడారు. ఈ సందర్భంగా డాక్టర్ హేమంత్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు సెల్‌ఫోన్ వినియోగాన్ని తగ్గించుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఎండల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో తగినంత తాగునీరు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వి. ప్రియాంక, డాక్టర్ త్రినాథ్, డాక్టర్ వివేక్, ఫిజియోథెరపీ నిర్వాహకులు చంద్రపాల్ రెడ్డి, కోచ్ మల్లేష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.