షాద్‌నగర్‌లో దారుణ దాడి
మేస్త్రిపై కత్తులతో దాడి చేసి గొంతు కోసిన దుండగులు
అక్రమ సంబంధం కోణంలోనూ పోలీసుల దర్యాప్తు
షాద్‌నగర్, మే 17 (మనఊరు ప్రతినిధి): షాద్‌నగర్ పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున సంచలనం రేపిన దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు ఓ మేస్త్రిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి గొంతు కోసి పరారయ్యారు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో కుప్పకూలిన బాధితుడిని స్థానికులు, పోలీసులు కలిసి వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతరం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి రిఫర్ చేశారు. ప్రస్తుతం అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చౌదర్‌గూడ మండలం పెద్ద ఎలికిచర్ల గ్రామానికి చెందిన జయరాం గత కొన్నేళ్లుగా షాద్‌నగర్ పట్టణంలో నివాసం ఉంటూ మేస్త్రి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున శివరాం నాయక్ ఆసుపత్రి సమీపంలో ఉండగా ఇద్దరు వ్యక్తులు అక్కడికి చేరుకుని అకస్మాత్తుగా కత్తులతో దాడి చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దుండగులు జయరాంను విచక్షణారహితంగా పొడవడంతో పాటు గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిన జయరాంను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని ఆసుపత్రికి తరలించి, ఘటన స్థలంలో ఆధారాలు సేకరించారు. ఈ ఘటన వెనుక పాత కక్షలున్నాయా..? వ్యక్తిగత విభేదాలా..? లేక అక్రమ సంబంధం కారణమా..? అనే కోణాల్లో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం అక్రమ సంబంధాల వ్యవహారమే ఈ దాడికి దారితీసి ఉండొచ్చని స్థానికంగా చర్చ జరుగుతోంది. అయితే అధికారికంగా పోలీసులు ఇంకా ఎలాంటి నిర్ధారణ చేయలేదు. పట్టణ నడిబొడ్డున జరిగిన ఈ దారుణ ఘటన స్థానికుల్లో భయాందోళనలకు గురిచేసింది. ఉదయం వేళలోనే ఇలాంటి ఘటన జరగడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
