హెచ్1ఎన్1 పాజిటివ్‌గా 45 ఏళ్ల వ్యక్తి నిర్ధారణ.. అప్రమత్తంగా ఉండాలని వైద్యుల సూచన
నిమ్మబావిగడ్డ ప్రాంతంలో వ్యక్తికి స్వైన్ ఫ్లూ నిర్ధారణ
దగ్గు, జ్వరం, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తికి హెచ్1ఎన్1 పాజిటివ్
జడ్చర్ల, మే 23 (మనఊరు ప్రతినిధి): జడ్చర్ల పట్టణంలోని నిమ్మబావిగడ్డ ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల వ్యక్తికి హెచ్1ఎన్1 (స్వైన్ ఫ్లూ) సోకినట్లు నిర్ధారణ అయింది. దగ్గు, జ్వరం, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయన స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిని సంప్రదించగా వైద్యులు ప్రాథమికంగా వైరల్ న్యుమోనియాగా గుర్తించారు. వ్యాధి తీవ్రత దృష్ట్యా ప్రత్యేక పరీక్షలకు నమూనాలు పంపించగా హెచ్1ఎన్1 స్వైన్ ఫ్లూ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సమాచారం. రోగిని పరీక్షించిన వైద్యులు వెంటనే మండల వైద్యాధికారులకు సమాచారం అందించారు. ఆరోగ్య శాఖ అధికారులు రోగిని పరిశీలించి, ఆయన నివసిస్తున్న ప్రాంతంలో వ్యాధి మరింత వ్యాపించకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. స్వైన్ ఫ్లూ నివారణలో భాగంగా స్విమ్మింగ్ పూల్స్‌కు వెళ్లకుండా ఉండటం, జనసమ్మర్థం ఎక్కువగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండటం మంచిదని వైద్యులు సూచించారు. జ్వరం, దగ్గు, జలుబు, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని జడ్చర్ల డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ పెరుమాళ్ళ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.