బస్తీల బాటలో బీజేపీ.. ప్రజా సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం

బస్తీల్లోకి బీజేపీ.. సంక్షేమ పథకాలతో ప్రజలకు చేరువ

బీజేపీ బస్తీ బాట కరపత్రాల ఆవిష్కరణ

జడ్చర్లలో బీజేపీ బస్తీ బాట ప్రచార కార్యక్రమానికి ఘన శ్రీకారం

జడ్చర్ల రూరల్, మే 22 (మనఊరు ప్రతినిధి): జడ్చర్ల నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక బీజేపీ బస్తీ బాట కార్యక్రమానికి సంబంధించిన ప్రచార కరపత్రాలను గురువారం ఘనంగా ఆవిష్కరించారు. ప్రజలకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ, ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఫలాలు చేరేలా చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు ముఖ్య అతిథిగా హాజరై కరపత్రాలను విడుదల చేశారు. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు క్రాంతి కిరణ్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, తెలంగాణ దళిత రత్న అవార్డు గ్రహీత డాక్టర్ కొంగలి శ్రీకాంత్ అడ్వకేట్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ప్రజల సమస్యలే మా అజెండా

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, “ప్రజల కష్టాలు తెలుసుకోవడమే మా లక్ష్యం – పరిష్కారమే మా బాధ్యత” అనే నినాదంతో బీజేపీ కార్యకర్తలు ప్రతి బస్తీలోకి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. ప్రచార కరపత్రాల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల వివరాలను పొందుపరిచారు. పీఎంజీకేఏవై ద్వారా పేదలకు ఉచిత రేషన్, పీఎం కిసాన్ ద్వారా రైతులకు వార్షిక ఆర్థిక సాయం, ఆయుష్మాన్ భారత్ ద్వారా కుటుంబాలకు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం, పీఎం ఆవాస్ యోజన ద్వారా గృహాల నిర్మాణం, పీఎం విశ్వకర్మ ద్వారా చేతివృత్తిదారులకు టూల్‌కిట్లు మరియు రుణాలు, ముద్ర యోజన ద్వారా చిన్న వ్యాపారులకు పూచీకత్తు లేని రుణాలు అందిస్తున్నట్లు వివరించారు. అలాగే అటల్ పెన్షన్ యోజన, పీఎంఎస్‌బీవై, పీఎంజేజేబీవై వంటి భీమా, పెన్షన్ పథకాల ద్వారా సామాన్యులకు భవిష్యత్ భరోసా కల్పిస్తున్నట్లు తెలిపారు.

సమాజ సేవే బీజేపీ ధ్యేయం

డాక్టర్ కొంగలి శ్రీకాంత్ మాట్లాడుతూ, “సమాజమే దేవాలయం – ప్రజలే నా బలం” అనే భావనతో బీజేపీ ప్రజల్లో పనిచేస్తోందన్నారు. జడ్చర్ల నియోజకవర్గంలోని ప్రతి బస్తీలో సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూరేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ స్థానిక నాయకులు, ఎస్సీ మోర్చా ప్రతినిధులు, ప్రధాన కార్యదర్శి దాస్ నాగరాజు, సతీష్ కుమార్, బహుజన నాయకులు మాచారం కృష్ణ, పోలేపల్లి జంగయ్యతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.