తండాలో ఆధ్యాత్మిక వైభవం

తండాలో ఆధ్యాత్మిక వైభవం

పంచముఖ హనుమాన్ ఆలయంలో ఘనంగా పాంచ్ పాలేర్ భోగ్

మహాహోమం

బంజారా వేదమంత్రాలతో మార్మోగిన తలుపునూరు తండా

రేవెల్లి, మే 22 (మనఊరు ప్రతినిధి): వనపర్తి జిల్లా రేవెల్లి మండలంలోని పాత తండా తలుపునూరు తండాలో గల శ్రీ పంచముఖ హనుమాన్ ఆలయం గురువారం భక్తి శ్రద్ధలతో కళకళలాడింది. ఆలయంలో నిర్వహించిన పాంచ్ పాలేర్ భోగ్ మరియు మహాహోమ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగి భక్తులను ఆధ్యాత్మిక పరవశంలో ముంచెత్తాయి. ఈ మహోత్సవానికి ప్రముఖ బంజారా ప్రవచనకర్త ఎస్పీ నాయక్ మహారాజ్, వేద పండితులు గోపాల్ చౌహన్ ముఖ్య అతిథులుగా హాజరై బంజారా సంప్రదాయ వేదమంత్రాల నడుమ ప్రత్యేక హోమ కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ ప్రాంగణం అంతా మంత్రోచ్చారణలు, భజనలు, ప్రత్యేక పూజలతో భక్తిమయ వాతావరణాన్ని సంతరించుకుంది.

భక్తులకు అండగా నిలిచే ఆంజనేయుడ

ఈ సందర్భంగా ఎస్పీ నాయక్ మహారాజ్ మాట్లాడుతూ, పవనసుతుడైన హనుమంతుడు అపారమైన భక్తి, శక్తి, ధైర్యానికి ప్రతీకగా నిలిచాడన్నారు. శ్రీరాముడిపై అచంచలమైన భక్తితో జీవించిన హనుమంతుడు యావత్ మానవాళికి ఆదర్శమని పేర్కొన్నారు. నమ్ముకున్న భక్తులకు పంచముఖ హనుమంతుడు ఎల్లప్పుడూ అండగా నిలిచి వరాలు కురిపిస్తాడని, తండాలో ఇలాంటి మహిమాన్వితమైన ఆలయం ఉండటం గ్రామ ప్రజల అదృష్టమని అన్నారు. గ్రామంలో భక్తి, ఐక్యత, ధర్మబద్ధ జీవనం పెంపొందాలని ఆకాంక్షించారు.

భారీగా తరలివచ్చిన భక్తజనం

హోమ కార్యక్రమం అనంతరం ప్రత్యేక ప్రసాద వితరణ నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామస్తులు, తండావాసులు, ప్రజాప్రతినిధులు, యువత, మహిళలు భక్తిశ్రద్ధలతో కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. ఆలయంలో భక్తుల రద్దీతో తండా మొత్తం పండుగ వాతావరణాన్ని సంతరించుకోగా, భక్తి గీతాలు, వేదమంత్రాలతో ప్రాంతమంతా మార్మోగింది.