మార్గమధ్యంలో మాయమైన 30 వేల కార్గేటెడ్ బాక్సులు..!
బాలానగర్‌లో కేసు నమోదు..
దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
బాలానగర్, జూలై 11 (మనఊరు ప్రతినిధి): లారీలో తరలిస్తున్న భారీ మొత్తంలో కార్గేటెడ్ బాక్సులు మార్గమధ్యంలో మాయమైన ఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సన్‌రెచ్ 850 గ్రాముల వంటనూనె ప్యాకింగ్ కోసం ప్రత్యేకంగా ముద్రించిన మొత్తం 30,380 కార్గేటెడ్ బాక్సులను లారీలో తరలిస్తుండగా, అవి గమ్యస్థానానికి చేరకముందే మార్గమధ్యంలో అదృశ్యమైనట్లు గుర్తించారు. దీంతో సంబంధిత సంస్థ ప్రతినిధులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు బాలానగర్ ఎస్సై నరేందర్ రెడ్డి తెలిపారు. బాక్సులు ఎక్కడ మాయమయ్యాయనే అంశంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టామని, లారీ ప్రయాణ మార్గం, సంబంధిత వ్యక్తుల వివరాలు, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఘటనకు బాధ్యులైన వారిని త్వరలోనే గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.
