కనకదుర్గ స్టీల్స్‌లో ఘోర ప్రమాదం

75 శాతం కాలిన గాయాలతో కార్మికుడు ప్రాణాపాయంలో

చికిత్స ఖర్చుల కోసం ఆస్పత్రి మార్పు యత్నమా..?

తోటి కార్మికుల ఆరోపణ

ప్రమాదంపై అధికారిక ప్రకటన కరువు.. 

విచారణ చేపట్టాలని డిమాండ్

నందిగామ, జూలై 12 (మనఊరు ప్రతినిధి): రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం వీర్లపల్లి గ్రామంలోని కనకదుర్గ స్టీల్స్ (శివశక్తి స్టీల్స్) పరిశ్రమలో శనివారం ఉదయం జరిగిన పారిశ్రామిక ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో పరిశ్రమ ఎలక్ట్రికల్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన కార్మికుడు భరత్ కుమార్ మిశ్రా (46) తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రమాదంలో ఆయనకు సుమారు 75 శాతం వరకు తీవ్ర కాలిన గాయాలు కావడంతో యాజమాన్యం వెంటనే హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. బాధితుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో కనీసం 45 రోజులపాటు అత్యవసర వైద్యం అవసరమని వైద్యులు సూచించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, చికిత్స ఖర్చులను తగ్గించుకునేందుకు బాధితుడిని మరో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం జరుగుతోందని తోటి కార్మికులు ఆరోపిస్తున్నారు. కార్మికుడి ప్రాణాలను కాపాడేందుకు అత్యున్నత స్థాయి వైద్యం అందించే పూర్తి బాధ్యత పరిశ్రమ యాజమాన్యమే తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదానికి గల అసలు కారణాలు ఇంకా వెల్లడికాలేదు. విద్యుత్ సంబంధిత లోపమా, లేక భద్రతా ప్రమాణాల నిర్లక్ష్యమా అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఘటనపై పరిశ్రమ యాజమాన్యం గానీ, సంబంధిత అధికారులు గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఈ ఘటనపై కార్మిక శాఖ, ఫ్యాక్టరీల శాఖ అధికారులు వెంటనే సమగ్ర విచారణ చేపట్టి ప్రమాదానికి దారితీసిన కారణాలను వెలుగులోకి తీసుకురావాలని, పరిశ్రమలో అమలవుతున్న భద్రతా ప్రమాణాలను పరిశీలించాలని స్థానికులు, కార్మిక సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. అలాగే బాధిత కార్మికుడికి మెరుగైన వైద్యం, తగిన పరిహారం అందేలా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.