ఫ్రీగా మద్యం పంచి వైన్ షాప్‌లో కాంగ్రెస్ నాయకుల హంగామా
యజమాని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు
అమరచింత, జూలై 12 (మనఊరు ప్రతినిధి): మండల కేంద్రంలోని ఓ వైన్ షాప్‌లో ఇద్దరు కాంగ్రెస్ నాయకులు హంగామా సృష్టించిన ఘటన ఆదివారం స్థానికంగా చర్చనీయాంశమైంది. వైన్స్ యజమాని తమకు సహకరించలేదనే ఆగ్రహంతో వారు దుకాణంలోకి ప్రవేశించి అక్కడ ఉన్న మద్యం బాటిళ్లను తీసుకుని వచ్చిన వారికి ఉచితంగా పంపిణీ చేసినట్లు సమాచారం. దుకాణ యజమాని అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ వారు వినిపించుకోకుండా వ్యవహరించినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే ఆయన అమరచింత పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై దుకాణ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిసింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని సమాచారం. ఈ ఘటన అమరచింతలో చర్చనీయాంశంగా మారింది.
