ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేస్తే సీఎం కార్యాలయం ముట్టడిస్తాం

ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేస్తే సీఎం కార్యాలయం ముట్టడిస్తాం

బిఆర్ఎస్ నాయకుడు దారమోని గణేష్

కల్వకుర్తి, జూలై 15 (మనఊరు ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యాసంస్థల అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని, వెంటనే విద్యారంగ సమస్యలను పరిష్కరించకపోతే ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తామని బిఆర్ఎస్ నాయకుడు దారమోని గణేష్ హెచ్చరించారు. బుధవారం పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడిచినా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇప్పటికీ పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు పూర్తిస్థాయిలో అందలేదని ఆయన విమర్శించారు. దీంతో విద్యాబోధనకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని, పాఠశాలల్లో తరగతుల వారీగా ఉపాధ్యాయుల కొరత కొనసాగుతుండటంతో విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వ విద్య బలోపేతంపై చిత్తశుద్ధి కనిపించడం లేదన్నారు. కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వ, గురుకుల పాఠశాలలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో చోటుచేసుకుంటున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొంటూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలువురు విద్యార్థులు మృతి చెందడం, వేలాది మంది అస్వస్థతకు గురవడం విచారకరమన్నారు. ఇటీవల నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ గురుకుల పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనను ప్రస్తావిస్తూ, గురుకులాల్లో మెరుగైన వసతులు, పరిశుభ్రమైన వాతావరణం, నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేశారు. కల్వకుర్తి పట్టణంతో పాటు జిల్లాలో అనేక ప్రైవేట్ పాఠశాలలు విద్యను వ్యాపారంగా మార్చి పాఠశాల ప్రాంగణాల్లోనే పుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫాంల విక్రయాలు చేస్తున్నా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. దీనిపై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రైవేట్ పాఠశాలల్లో కనీస అర్హతలు లేని ఉపాధ్యాయులను తక్కువ వేతనాలతో నియమిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అలాగే ఫిట్‌నెస్, భద్రతా ప్రమాణాలు లేని పాఠశాల బస్సుల్లో అధిక సంఖ్యలో విద్యార్థులను తరలిస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నా రవాణా శాఖ స్పందించడం లేదన్నారు. ఈ అంశంపై ఇప్పటికే అధికారులకు వినతిపత్రం సమర్పించినప్పటికీ ఇప్పటివరకు ఒక్క పాఠశాల బస్సుపై కూడా తనిఖీలు చేపట్టలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి, మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయులను నియమించి, కొత్త పాఠశాల భవనాల నిర్మాణం చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సర్పంచ్ సిద్ధమోని రమేష్ గౌడ్, శేఖర్ గౌడ్, రామకృష్ణ, పెరుమాళ్ల కృష్ణ, రవి తదితరులు పాల్గొన్నారు.