గ్రామీణ ఓటర్లకు న్యాయం చేయాలి..
ఎస్ఐఆర్ గడువు పొడిగించాలి
ఓటు హక్కు కోల్పోకుండా ఎస్ఐఆర్ గడువు పొడిగించండి:
ప్రజావాణిలో బీఎస్పీ నాయకుల డిమాండ్
గ్రామీణ ఓటర్లకు అవకాశం కల్పించాలి..
ఎస్ఐఆర్ గడువు పొడిగించాలి
ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై విచారణ, 108 సిబ్బందికి గది, కెజిబివి బదిలీలకు డిమాండ్
ప్రజావాణిలో కలెక్టర్‌కు బీఎస్పీ వినతిపత్రం
నాగర్‌కర్నూల్, జూలై 13 (మనఊరు ప్రతినిధి): జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో అధికశాతం ఓటర్లు నిరక్షరాస్యులు కావడంతో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ గడువును పొడిగించాలని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నాయకులు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్‌కు ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృథ్వీరాజ్ మాట్లాడుతూ, ఈ నెల 24తో ఎస్ఐఆర్ ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండటంతో వారు ఇతరుల సహాయంతోనే దరఖాస్తులు నింపాల్సి వస్తోందన్నారు. 2002 ఓటరు జాబితా అందుబాటులో లేకపోవడం, వలస కార్మికులు, ఉద్యోగులపై పని ఒత్తిడి వంటి కారణాల వల్ల అనేక మంది గడువులోపు ఫారాలు సమర్పించలేక ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అందువల్ల గడువును పొడిగించేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు జిల్లా కలెక్టర్ ద్వారా జిఓ సిఫారసు చేయాలని కోరారు. అలాగే నాగర్‌కర్నూల్‌లోని టిఎన్ కార్యాలయం పక్కనున్న ప్రభుత్వ ఖాళీ స్థలంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమణల నుంచి రక్షించాలని కోరారు. 24 గంటల అత్యవసర సేవలు అందిస్తున్న 108 అంబులెన్స్ సిబ్బందికి జిల్లా కేంద్రంలో విశ్రాంతి కోసం గది సౌకర్యం కల్పించాలని, గతంలో ఉన్న సౌకర్యాన్ని పునరుద్ధరించాలని కోరారు. ఇటీవల అమ్రాబాద్ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజనింగ్ ఘటన జరిగిన నేపథ్యంలో జిల్లాలోని అన్ని సంక్షేమ శాఖల హాస్టళ్లు, గురుకులాలు, కెజిబివిలపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి ముందస్తు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా జిల్లాలో కొంతమంది కెజిబివి స్పెషల్ ఆఫీసర్లు (ఎస్ఓలు), సిబ్బంది పదేళ్లకు పైగా ఒకే కేంద్రంలో కొనసాగుతున్నారని, దీంతో పరిపాలనలో నిర్లక్ష్యం పెరుగుతోందని ఆరోపించారు. జిల్లా లేదా డివిజన్ స్థాయిలో పారదర్శకంగా బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్లమెంట్ ఇన్‌చార్జ్ సి. కళ్యాణ్, జిల్లా కార్యదర్శి బి. దాస్, నాయకులు కాకునూరి మధు, నాగరాజ్, బాలరాజు, అర్జున్, బీవీఎఫ్ అసెంబ్లీ కన్వీనర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
