ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయుల చేయూత

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయుల చేయూత

సొంత ఖర్చులతో యూనిఫాంలు, షూలు పంపిణీ

పాఠశాల అభివృద్ధికి విరాళాలు, హామీలు

షాద్‌నగర్, జూలై 14 (మనఊరు ప్రతినిధి): ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఉపాధ్యాయుల అంకితభావం, సేవా దృక్పథం తోడైతే ప్రభుత్వ విద్యకు కొత్త ఊపు వస్తుందని ఫారూఖ్‌నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ఉర్దూ మాధ్యమం) ఉపాధ్యాయులు మరోసారి నిరూపించారు. విద్యార్థుల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఉపాధ్యాయులు తమ సొంత ఖర్చులతో విద్యార్థులకు తెల్లని యూనిఫాంలు, షూలు, బెల్టులు, టైలను అందజేసి అభినందనలు అందుకున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి. విజయలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, మండల విద్యాశాఖ అధికారి మనోహర్, పీఆర్‌టీయూ టీఎస్ రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షుడు గోవర్ధన్ యాదవ్, వార్డు కౌన్సిలర్ కర్ణాటక మురళీమోహన్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి విద్యార్థులకు అవసరమైన సామగ్రిని అందించడం ప్రశంసనీయమని కొనియాడారు. పాఠశాల అభివృద్ధికి సహకారంగా యూటీఏ రాష్ట్ర అధ్యక్షులు రూ.20 వేల విరాళాన్ని ప్రకటించి అందజేశారు. అలాగే పీఆర్‌టీయూ టీఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు గోవర్ధన్ యాదవ్ పాఠశాలలోని ప్రతి తరగతి గదిలో తన సొంత ఖర్చుతో ఫ్యాన్లు ఏర్పాటు చేయిస్తానని ప్రకటించారు. మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్ మాట్లాడుతూ పాఠశాలకు అవసరమైన మౌలిక వసతుల సమస్యలను స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయుల సేవాభావం వల్లే ప్రభుత్వ పాఠశాలలకు సమాజంలో విశ్వసనీయత పెరుగుతోందని, గత విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫలితాల్లో ఈ పాఠశాల సాధించిన అత్యుత్తమ విజయాలు అందుకు నిదర్శనమని అతిథులు పేర్కొన్నారు. అనంతరం పాఠశాల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో యూటీఏ రాష్ట్ర నాయకులు ఖాజా కుతుబుద్దీన్, షకీల్ అహ్మద్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, యూటీఏ ఉపాధ్యక్షుడు అన్సారీ అహ్మద్ బజాహర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మహమ్మద్ మాక్సూద్ ఖాన్, సీనియర్ పాత్రికేయుడు మన్సూర్ ఖాన్, ఏఏపీసీ చైర్‌పర్సన్ కుర్షీద్ బేగం, మాజీ ఎస్‌ఎంసీ చైర్మన్ మహమ్మద్ బవజీర్, ఆర్‌యూపీపీటీఎస్‌ఆర్‌ఆర్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ దార్ల రాఘవేంద్రాచారి, ఉపాధ్యాయులు నీరజ, మల్లికార్జున్, షాజహాన్ బేగం, అభిదా బేగం, మజర్ ఉన్నీసా బేగం, గౌసియా బేగం, రేష్మ బేగం, నసీం బేగం, సంగీత, మంజుల, షమీమ్ తదితరులు పాల్గొన్నారు.